ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ నావను నడిపే నాయకుడే కరువయ్యాడా..? రఘువీరా రెడ్డి రాజీనామా చేసి నెలలు గడిచిపోతున్నా.. ఇప్పటికీ ఆ స్థానం భర్తీ కాకపోవడానికి కారణమేంటి..? గతంలో పీసీపీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేసిన నేతలేమయ్యారు..? నడిపే నాయకుడు లేకుండా దయనీయ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉండటానికి కారణమేంటి?

 

ఆరేళ్లు అవుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన పాపం కాంగ్రెస్ పార్టీని ఇంకా వెంటాడుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవని కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. రెండు ఎన్నికల్లో పార్టీని నడిపిన రఘువీరారెడ్డి 2019 పరాజయం తర్వాత పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి నాయకుడు లేని నావలానే.. కేవలం ఇంఛార్జీల చేతుల మీద నడుస్తోంది కాంగ్రెస్. 

 

ఏపీలో కాంగ్రెస్‌ని నడిపించే సత్తా ఉన్న వారి కోసం ఏఐసీసీ ఎన్నో ప్రయత్నాలు చేసినా.. అవి సఫలం కాలేదు. అన్ని జిల్లాల నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపినా అధ్యక్షుడిని మాత్రం నియమించలేకపోయింది. అధ్యక్ష పదవి స్వీకరించడానికి ఎవరూ సుముఖంగా లేరనేది పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న మాట. రాష్ట్రంలోనే కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ పరిస్థితి.. అంతంతమాత్రంగానే ఉండటంతో... అధిష్ఠానం వైపు చూడ్డానికే భయపడుతున్నారు నేతలు. కిరణ్‌ కుమార్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపడతారనే ప్రచారం జరగ్గానే.. ఆయన దాన్ని ఖండించడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. 

 

అధికార వైసీపీపై అవకాశం వచ్చినప్పుడల్లా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వైసీపీ సర్కార్ చేపట్టే కార్యక్రమాలపై టీడీపీ, జనసేన, బీజేపీ పోరాటాలు చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌లో మాత్రం చడీ చప్పుడు లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ సాగాలంటే వైసీసీ ప్రభుత్వంపై పోరాటం తప్పనిసరి. అందుకు తగిన నేత ఎవరనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆర్ధిక బలంతో పాటు సామాజిక సమీకరణాలు కూడా లెక్కలేసుకొని.. రెండూ ఉన్న వారికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తోంది అధిష్టానం. 

 

పల్లంరాజు, శైలజానాథ్, పద్మశ్రీ, రుద్రరాజు, చింతా మోహన్‌ వంటి వారు రేసులో ఉన్నారు. అన్ని విధాల సమర్ధుడికి అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తుంటే.. అసలు పగ్గాలు చేపట్టడాని ఎవరు ముందుకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: