అమరావతికి తోడుగా న్యూ అమరావతి రెడీ అవ్వబోతోందట. అంటే ఢిల్లీ, న్యూ ఢిల్లీ లాగే అనుకోండి. అమరావతిలో ఏమో చంద్రబాబునాయుడు నిర్మించిన నాసిరకం నిర్మాణాలు, జరుగుతున్న ఉన్నతాధికారుల రెసిడెన్షియల్ క్వార్టర్స్ మాత్రమే ఉంటాయని సమాచారం.  మంగళగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే  న్యూ అమరావతిలోనే పూర్తిస్ధాయి రాజధాని నిర్మాణాలుంటాయని తెలుస్తోంది.

 

సిఆర్డీఏ ఉన్నతాధికారులతో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో కాస్త అటు ఇటుగా ఇవే విషయాలు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుత వెలగపూడి ప్రాంతం భారీ నిర్మాణాలకు అనువైన ప్రాంతం కాదని నిపుణులు కూడా ఎప్పుడో చెప్పారు. అయినా చంద్రబాబే వినకుండా ఇక్కడ భారీ నిర్మాణాలకు పూనుకున్నారు. పోనీ మొదలుపెట్టిన నిర్మాణాలను పూర్తి చేశారా ? అంటే అదీ లేదు. సగం సగం చేసి వదిలిపెట్టారు.

 

అందుకనే జగన్ మొదలుకాని నిర్మాణాలను నిలిపేశారు. సగానికి పైగా జరిగిన నిర్మాణాలను మాత్రమే పూర్తి చేయమని ఉన్నతాధికారులను ఆదేశించారు. అంటే పూర్తిస్ధాయిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్ భవన్ నిర్మాణాలు ఇక్కడ ఉండవన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ ఉన్నచోటే రాజధానిగా ప్రాధాన్యత ఉంటుందని అందరికీ తెలిసిందే.

 

రాజధాని ప్రాంతంలోనే ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూమే సుమారు 10 వేల ఎకరాలుందని సమాచారం. ఇదే విషయాన్ని మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ప్రభుత్వానికి రాసిన లేఖలో చెప్పారు. కాబట్టి శాస్వతంగా నిర్మించబోయే అసెంబ్లీ, రాజ్ భవన్, సచివాలయం మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతుందని సమాచారం. ఈ ప్రాంతాన్నే న్యూ అమరావతి అని పిలుస్తారట.

 

ఇక హైకోర్టును అమరావతి ప్రాంతంలో నిర్మించే ఆలోచనైతే జగన్ కు లేదనే అంటున్నారు. కర్నూలుకు హై కోర్టును తరలిస్తే దశాబ్దాల రాయలసీమ వాసుల  డిమాండ్ నెరవేర్చినట్లవుతుందని జగన్ అనుకుంటున్నారట. అలాగే వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలను కూడా ఇతర జిల్లాల్లో ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారట. దాని వల్ల అన్నీ జిల్లాల్లో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోంది. అదే సమయంలో రాజధాని ప్రాంతంపై ఒత్తిడి కూడా తగ్గుతుందని జగన్ అనుకుంటున్నారట. మరి న్యూ అమరావతి నిర్మాణం ఎప్పుడు మొదలుపెడతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: