ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని కేబినెట్ ప‌లు కీల‌క‌ నిర్ణ‌యాలు తీసుకుంది.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జ‌రిగిన ఈ కేబినెట్‌ సమావేశంలో ‘వైఎస్‌ఆర్‌ నవశకం’ పేరుతో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి మరింత మందికి లబ్ధి చేకూర్చేందుకు కొత్తగా రూపొందించిన అర్హత మార్గదర్శకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిది. ‘జగనన్న విద్యా దీవెన’ కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ. 15 వేలు చొప్పున ఇవ్వాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే చెప్పేసింది. డిగ్రీ ఆ పైన కోర్సులు చదివే విద్యార్థులకు హాస్టల్‌ ఫీజుల కింద ఏటా రూ.20వేల చొప్పున ఇచ్చే ‘జగనన్న వసతి’కి సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మంత్రి పేర్ని నాని క్యాబినెట్ స‌మావేశానికి సంబంధించిన బ్రీఫింగ్ ఇచ్చారు. 

 


జగనన్న వసతి క్రింద మెస్ ఛార్జెస్ అందిచ‌నున్న‌ట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. డిసెంబర్‌లో 50శాతం, జూలై 50 శాతం చెల్లింపు చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఇందుకు 2300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంద‌ని పేర్కొన్నారు. జ‌గనన్న విద్యా దీవెనకు 3400 కోట్ల ఖర్చు కానుంద‌ని పేర్కొన్నారు. రూ. 2,50,000 వార్షిక ఆదాయం ఉన్నవారు , 10 ఎక‌రాల మాగాని  లేదా 25 ఎకరాలు మెట్ట  లేదా రెండూ  25 ఎకరాలు గానీ ఉన్నవారు అర్హుల‌ని పేర్కొన్నారు. పారిశుధ్యం పనిచేసే అందరికీ 
ఈ పథకాలు వర్తింపు చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. కాపు-తెలగ- ఒంటరి కులాలు ఆడపడచులకు వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 25 వేల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. 

 

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేష‌న్‌కు అధికారు బృందం ఏర్పాటుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జగ‌న్‌మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న‌ట్లు  మంత్రి పేర్ని నాని ప్ర‌క‌టించారు. సీపీఎస్‌ రద్దుకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు విభజన చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. సెంట్రల్ పవర్ కంపెనీలోకి కృష్ణా- గుంటూరు- ప్రకాశం జిల్లాలు రానున్న‌ట్లు పేర్కొన్నారు.

 

 

కేబినెట్ నిర్ణయాలు..

- వైయస్ఆర్ కాపు నేస్తం పథకం అమలుకు కేబినెట్ ఆమోదం.

- వైయస్ఆర్ కాపు నేస్తం పథకానికి రూ.1,101 కోట్ల కేటాయింపు.

- కాపు సామాజిక వర్గం మహిళలకు ఏడాదికి రూ.15వేలు సాయం.

- 45ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు సాయం.

- రెండున్నర లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికి వర్తింపు.

- 10ఎకరాల మాగాణి,25 ఎకరాల లోపు మెట్ట ఉన్నవారికి వర్తింపు.

- ట్రాక్టర్ ,ఆటో ,ట్యాక్సీ నడుపుకునేవారికి మినహాయింపు.

- టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య 19నుంచి 29కి  పెంచుతూ కేబినెట్ నిర్ణయం.

- పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం.

- ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ.

- ఇళ్ల పట్టాలపై పేదలకు హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ కు నిర్ణయం.

- జగనన్న వసతి పథకానికి కేబినెట్ ఆమోదం.

- రెండు విడతలుగా జగనన్న వసతి దీవెన రూ.2,300 కేటాయింపు.

- ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు,పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు ,డిగ్రీ ,ఉన్నత విద్యార్థులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం.

- కడప స్టీల్ ప్లాంట్ కు డిసెంబర్ 26న శంకుస్థాపన.

- 3,925 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయం.

- ఇనుప ఖనిజం కోసం ఎన్ఎండీసీ తో ఒప్పందం.

- ఆంధ్రప్రదేశ్ పవర్ కార్పొరేషన్ కు బ్యాంక్ నుంచి రుణాలు.

- మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.

- కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం.

- బియ్యం కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం.

- ఫీజు రీయింబర్స్ మెంట్ ,ఆరోగ్య శ్రీ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం.

- జగనన్న విద్యాదీవెన పేరుతో ఫీజు రీయింబర్స్ మెంట్ 

- ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.3,400 కోట్లు కేటాయింపు.

- రూ.2.5లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి విద్యా దీవెన వర్తింపు .

- సీపీఎస్ రద్దుపై ఏర్పాటైన వర్కింగ్ కమిటీకి కేబినెట్ ఆమోదం

మరింత సమాచారం తెలుసుకోండి: