టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ కమ్మరాజ్యంలో కడప రెడ్లు. ఇప్పటికే గతంలో వంగవీటి, రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి వివాదాస్పద సినిమాలు తీసిన వర్మ, అవి పెద్దగా ఆడకపోయినప్పటికీ కూడా ఇంకా ఇటువంటి అంశాలనే నమ్ముకుని సినిమాలు తీస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి పార్టీ ఘోర పరాజయం ఎదుర్కోవడం, అలానే వైసీపి అద్భుత విజయాన్ని అందుకుని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం కావడం జరిగింది. 

 

ఇక ఇదే అంశాన్ని కొంత బేస్ గా తీసుకుని ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాని తీస్తున్నారు వర్మ. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు కూడా యూట్యూబ్ లో ప్రేక్షకుల విశేష ఆదరణను చూరగొన్నాయి. ఈ సినిమాలో జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ తదితరులను పోలిన వారిని వెతికి తెచ్చి వారి పాత్రల్లో నటింపచేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈ ట్రైలర్లు చూస్తుంటే చంద్రబాబు, లోకేష్ లను వర్మ ఒకింత ఎక్కువగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో చంద్రబాబు పాత్రధారి, తన కొడుకైన లోకేష్ కు పప్పు వడ్డించే సీన్ ని ఎంతో హైలైట్ చేసిన వర్మ, ఆ సీన్ ని కేవలం పప్పు అనే పదార్ధాన్ని రిప్రెసెంట్ చేస్తూ మాత్రమే తీశానని చెప్పడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా విశేషాలను గురించి వర్మ నేడు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. 

 

ఈ సినిమాలో చంద్రబాబు పాత్రధారిని ఎక్కడి నుండి తీసుకువచ్చారు, అచ్చంగా ఆయనను పోలినట్లే ఉన్నారు కదా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన వర్మ, వాస్తవానికి అతడి వీడియోని కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా లో చూడడం జరిగిందని, వెంటనే తనకు తెలిసిన వారి ద్వారా ఆయన గురించి వాకబు చేసి, హైదరాబాద్ పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేశామని, ఆ తరువాత దాదాపుగా నెలరోజులకు పైగా ఆయనకు ట్రైనింగ్ ఇచ్చిన తరువాత సినిమాలో నటింపచేశామని వర్మ అన్నారు. వృత్తి రీత్యా ఆయన హోటల్ సర్వర్ అని, మహారాష్ట్ర లోని నాసిక్ లో ఒక హోటల్ లో పనిచేసేవాడని అన్నారు. దానిని బట్టి మొత్తానికి ఒక హోటల్ సర్వర్ ని స్టేట్ సీఎంని చేసిన ఘనత వర్మకు మాత్రమే చెల్లిందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: