చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అనుబంధ ఆలయంలో క్షుద్రపూజల ఉదంతం సంచ‌ల‌నంగా మారింది.  శ్రీకాళహస్తికి సమీపంలోని వేడంలో కొలువైన కాలభైరవ ఆలయంలో అమావాస్య రోజున కొంతమంది తమిళులు క్షుద్రపూజలు నిర్వహించిన‌ట్లు వార్త‌లు రావ‌డం భ‌క్తుల మ‌నోభావాల‌ను తీవ్రంగా దెబ్బ‌తీసింది. అర్ధరాత్రి క్షుద్రపూజలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవస్థానం ఏఈవో ధనపాల్‌ ప్రోత్సాహంతోనే తాము పూజలు చేశామని ఆ ఐదుగురు వ్యక్తులు వెల్లడించారు. దీంతో ఏఈవో ధనపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలోను క్షుద్రపూజలు చేసి ధనపాల్‌ సస్పెండ్‌ అయినట్లు ఆరోప‌ణ‌లు ఉండ‌టం....ఈ పూజలకు ఆలయ సెక్యూరిటీ గార్డులు సహకరించినట్టు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న త‌రుణంలో...ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

 

క్షుద్రపూజల విషయం మీడియాలో పెద్ద ఎత్తున హ‌ల్ చ‌ల్ కావ‌డం, ముక్కంటి ఆలయ ఏఈవో ధనపాల్‌ చెబితేనే క్షుద్రపూజలు నిర్వహించామని పోలీసులు అరెస్టు చేసిన‌ నలుగురు తమిళనాడువాసులు చెప్ప‌డంతో....ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ స్పందిస్తూ...ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి 24 గంట‌ల వ్య‌వ‌ధిలో నివేదిక స‌మ‌ర్పించాల‌ని దేవాదాయ శాఖ కార్య‌ద‌ర్శిని ఆదేశించారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీచేశారు. 

 

ఇదిలాఉండ‌గా,శ్రీకాళహస్తి ఏఈవో  ధన్‌పాల్ కు తమిళనాడు, కర్ణాటకలో శిష్యులు ఉన్నారు. వారికి చెందిన వివిధ ర‌కాలైన‌ కోరికలు తీరటం కోసం ఇతను క్షుద్రపూజలు చేస్తూ ఉంటాడని సమాచారం. 26వ తేదీ అమావాస్య కావడంతో అర్ధరాత్రి సమయం ధన్ పాల్ క్షుద్రపూజలు చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఇప్ప‌టికే ధనపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న్ను విచారిస్తే నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది. కాగా, పరారీలో ఉన్న ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం గాలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. మ‌రోవైపు భైరవకోన ఆలయంలో నిక్షిప్తమైన నిధుల కోసమే క్షుద్రపూజలు నిర్వహించారా అనే అంశాన్ని సైతం ప‌లువురు తెర‌మీద‌కు తెస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాల‌కు స్పందించి కార్య‌ద‌ర్శి ఇచ్చే నివేదిక‌పై ఆస‌క్తి నెల‌కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: