సినీఫక్కీలో అందరినీ ఆసక్తికి గురిచేసిన మహారాష్ట్ర రాజకీయాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. ముందు కొన్ని దశాబ్దాలుగా కలిసి సాగుతున్న బిజెపి-శివసేన విడిపోవడం... ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడం, ఇక అసెంబ్లీ కాలం ముగుస్తుందనగా రాజీనామా చేయడం... తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమే అని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రకటించిన సమయంలో గవర్నర్ అనూహ్య రీతిలో రాష్ట్రపతి పాలనను సిఫారసు చేయడం త్వరత్వరగా జరిగిపోయాయి.

 

అయితే తన అనుభవాన్ని అంతా రంగరించి శరద్ పవార్ సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ థాక్రే ను ప్రకటించిన తర్వాత మరుసటి రోజు మూడు పార్టీలు కలిసి గవర్నర్ ను కలవాలని నిర్ణయించారు. ఇక్కడ మొదలైంది అసలైన ఆట. రాత్రికి రాత్రే చదరంగంలో పావులు కదిపుతున్నట్టు అమిత్ షా మహారాష్ట్ర రాజకీయ ఆటను పూర్తిగా మార్చేశాడు. ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ మద్దతుతో దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సీఎంగా ప్రమాణం చేయగా అజిత్ డిప్యూటీ సీఎం అయ్యారు.

 

దీంతో విపక్షాలు కోర్టు మెట్లు ఎక్కగా సుప్రీంకోర్టు అందరినీ మరుసటిరోజు బలపరీక్షకు సిద్ధం అవమని ఆదేశించింది. అయితే తమ దగ్గర సంఖ్యాబలం లేదని బీజేపీ చేతులెత్తేసిన తర్వాత ఎట్టకేలకు ఉద్ధవ్ థాక్రే డిసెంబర్ 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం ఖరారైపోయింది. ఇ

 

మరాఠా రాజకీయాల్లో ఇన్ని మలుపులను ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇన్ని ట్విస్టులు ఉన్న ఈ కథ ను మన కమల్ హాసన్ గారు 28 ఏళ్ల క్రితమే అంటే 1981లోనే ఊహించాడంటున్నారు నెటిజన్లు. ఆకలి రాజ్యం సినిమాలో ఇంటర్వ్యూకు వెళ్లిన కమల్ హాసన్‌కు మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ప్రశ్న ఎదురవుతుంది. దీనికి ఆయన బదులిస్తూ.. ఈ రోజా? నిన్నా? మొన్నా? ఎందుకంటే అక్కడ రోజుకొకరు మారుతున్నారని బదులిస్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: