టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతిలో పర్యటనకు సిద్ధమయ్యి.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో కలిసి రాజధానిలో నిర్మాణాలను పరిశీలించి, తదుపరి రాజధాని ప్రాంతంలో రైతులు, స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశం చేయనున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. 

 


బాబు అమరావతి పర్యటనకు వెళ్లే ముందు ఇలా "రాజధానిపట్ల 5 కోట్ల ఆంధ్రులకు ఉన్న భావోద్వేగాలు వైసీపీ వాళ్ళకు తెలుసు. అందుకే ఒక పథకం ప్రకారం దుష్ప్రచారాలు చేసి అమరావతిని క్రమక్రమంగా చంపాలన్న నీచమైన కుట్రలకు వైసీపీ తెరతీసింది. ఆ కుట్రలను బయటపెట్టేందుకే నేను అమరావతికి వెళ్తున్నా". అని ట్వీట్ చేశారు. కాగా, రైతులకు, రైతు కూలీలకు న్యాయం జరిగేలా చూడాలని, అమరావతిలో నిలిచిపోయిన  పనులను తిరిగి పునరుద్ధరించడానికి పర్యటనను చేస్తున్నారని తెలిపారు. ఇటు మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. వేలాదిమంది రైతులు త్యాగఫలితం అమరావతి.. అందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ వైఎస్ జగన్ మాత్రం రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. రైతుల గౌరవాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు.

 


అయితే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన ఇప్పుడు ఉద్రిక్తతకు దారి తీసింది. బాబుకు స్వాగతం పలుకుతూ.. టీడీపీ కార్యకర్తలు, ఓ వర్గం రైతులు.. నిరసన తెలియజేశారు. మరో వర్గం రైతులు పోటాపోటీగా మోహరించారు. చంద్రబాబు కాన్వాయ్ వెంకటాయపాలెం దగ్గరకు చేరుకోగానే ఓ వర్గం రైతులు రెచ్చిపోయారు. బాబు కాన్వాయ్‌పై చెప్పులు, కర్రలు విసిరారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి ఫ్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. 

 


ఇక రెండు వర్గాలు భారీగా మోహరించడంతో అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తగా పోలీసుల్ని భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అడుగడుగా భద్రతను పెంచారు. చంద్రబాబు కాన్వాయ్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరూ నినాదాలు చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు చంద్రబాబు పర్యటనలో ముందుగా కూల్చి వేసిన ప్రజావేదికను పరిశీలించారు. తర్వాత చంద్రబాబు ఉద్దండరాయపాలెం చేరుకొని ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని గృహ సముదాయాల నిర్మాణాలను పరిశీలించనున్నారు. తర్వాత రాజధాని ప్రాంత రైతులతో సమావేశమవుతారని తెలిపారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: