టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఏపీ రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. అధికార వైసీపీ నేతలు రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చిన  నేపథ్యంలో మాజీ సీఎం చేపట్టిన ఈ పర్యటన రణరంగమైంది. ఆయన వెళ్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు, కర్రలతో దాడులకు దిగారు. దీంతో బస్సు అద్దం కూడా పగిలింది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు.  

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రధాని చేతుల మీదుగా...రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి ఆయన పర్యటన చేపట్టారు. పార్టీ ప్రజా  ప్రతినిధులు, ఇతర నేతలతో కలిసి చంద్రబాబు ఈ టూర్ లో పాల్గొన్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ ద్వారా వెంకటపాలెం మీదుగా ఉద్దండరాయునిపాలెం చేరుకున్నారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్రమోడి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు.  

 

ఇక...పేదలు...అధికారులు...జడ్జీలు...ప్రజాప్రతినిధుల కోసం వేర్వేరుగా నిర్మించిన గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలించారు. ఆ తర్వాత విట్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాలను సందర్శించారు. వెంకటాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, నేలపాడు, రాయపూడి, ఐనవోలు గ్రామాల మీదుగా టీడీపీ నేతల బృందం పర్యటన సాగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో రాజధాని నగరం అమరావతిలో నిర్మించిన నిర్మాణాలు, రోడ్డు ప్రాజెక్టులను, భవనాలను పరిశీలించింది చంద్రబాబు బృందం. 

 

అయితే... గత ఆరు నెలలుగా పనులు నిలిపేయడం వల్ల వేలాది మంది కూలీలు జీవనోపాధి కోల్పోయారని టీడీపీ ఆరోపిస్తోంది. దీని వల్ల రాజధాని  ప్రతిష్టకు భంగం వాటిల్లిందనేది ఆ పార్టీ వాదన. ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు బృందం పర్యటన కొనసాగింది. మరోవైపు...అమరావతిలో చంద్రబాబు పర్యటన రైతుల మధ్య చిచ్చు పెట్టింది. రాజధాని ప్రాంతంలోని రైతులు రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీలుగా విడిపోయి...తిట్టుకుంటున్నారు. ఒక వర్గం చంద్రబాబు టూర్‌ను సపోర్ట్ చేస్తే.. మరోవర్గం రైతులు ఐదేళ్లలో ఏం చేయనిది ఇప్పుడెందుకు వచ్చారని ప్రశ్నించారు.  చంద్రబాబు రావొద్దని....వైసీపీకి మద్దతిస్తున్న నేతలు రాజదాని భూముల్లో నల్లజెండాలతో ఎదురొచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: