దీర్ఘ‌కాలికంగా సాగుతున్న ఆర్టీసీ స‌మ్మెకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్  ఊహించ‌ని రీతిలో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఒక‌టి కాదు రెండు తీపిక‌బుర్లు ఇచ్చారు. ``ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లో చేరండి. చేర్చుకోవాల‌ని ఆర్టీసీ వాళ్ల‌కు ఆదేశాలిస్తాం. అంతేకాకుండా ఆర్టీసీకి తక్షణ సాయం కింద రేపు ఉదయంలోపు రూ.100 కోట్లు ఇస్తాం`` అని ప్ర‌క‌టించారు. మ‌రోవైపు కిలోమీటర్ కి 20 పైసలు వంతున ఛార్జ్ పెంపు ద్వారా దాదాపు 750 కోట్ల రూపాయ‌ల నిధులు ఇవ్వ‌నున్న‌ట్లు వివ‌రించారు.

 


కేబినెట్ స‌మావేశంలో ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలు విని పెడదారి పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  సమ్మెకు పూర్తి బాధ్యత యూనియన్లదే. అసంబద్ద డిమాండ్లతో కూడిన అనాలోచిత సమ్మె చేశారు. ప్రతిపక్షాల వల్ల ఆర్టీసీ కార్మికులు రోడ్డునపడ్డారు. ఇంకా కార్మికులను కొందరు ప్రలోభాలు పెడుతున్నారు. ఢిల్లీ తీసుకెళ్లి ఏదో చేస్తామని  కార్మికులకు ఆశలు కల్పిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెను అడ్డుపెట్టుకొని పార్టీలు రాజకీయ చలికాచుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. కార్మికులారా..ఇప్పటికైనా కళ్లు తెరవండి. రేపు పొద్దున అందరూ కార్మికులు హాజరు అవ్వండి. ఆర్టీసీ సంస్థ బతకాలి. ఆర్టీసీ కార్మికులంతా మా బిడ్డలే. ఆర్టీసీ కార్మికులను యాజమాన్యం వేధించకుండా చూస్తాం. కార్మికులను కాదని మేం ఏ నిర్ణయం తీసుకోం. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ఎలాంటి కండిషన్లు పెట్టం. సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇస్తున్నం. `` అని కేసీఆర్ ప్ర‌క‌టించారు. 

 

చీఫ్ జస్టీస్ సైతం ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచారని సీఎం కేసీఆర్‌ అన్నారు. కిలోమీటర్ కి 20 పైసలు వంతున ఛార్జ్ పెంపున‌కు ఆదేశాలు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. విపక్షాలు ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పేల్చుతున్నారని, తాము ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పలేదని, కార్మికుల పొట్టకొడుతున్నారని ప్రచారం చేయడం దారుణమన్నారు. ఆర్టీసీ లో కేంద్రం వాటా ఉందని వస్తున్న వార్తలపై  స్పందించిన కేసీఆర్ .. ఇదే విషయంపై హైకోర్ట్ ను ఆశ్రయిస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: