తెలంగాణలో ఉపాధ్యాయ పదోన్నతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదేశించారు. ఈ తరుణంలో.. పదోన్నతులపై ఉపాధ్యాయ సంఘాలు ఏమంటున్నాయి ? పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏం చెబుతున్నారు ? అసలు టీచర్ ప్రమోషన్స్ చేపట్టడం అంతా ఈజీనా...  అడ్డంకులు ఏంటి..?  

 

ప్రమోషన్స్ కోసం టీచర్లు గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎదో ఒక రకంగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలను కలిసి పలుమార్లు విజ్ఞప్తి కూడా చేశారు. ఎట్టకేలకు ఈ అంశంపై సర్కారు స్పందించింది. పాత పది జిల్లాల ప్రాతిపదికన ప్రతిపాదనలు పంపించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. అయితే అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే తప్ప ప్రమోషన్ లు ఇవ్వడం అంత సులువైన  అంశం కాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి . ఉపాధ్యాయులు చాలా అసంతృప్తితో ఉన్నారని ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అన్ని స్థాయిల్లో ప్రమోషన్ లు చేపట్టాలని కోరుతున్నారు. రాష్ట్ర పతి ఉత్తర్వుల్లోనూ ప్రొవిజన్ ఉందనీ... పాత పది జిల్లాల ప్రకారం తాత్కాలిక ప్రమోషన్స్ ఇచ్చుకోవచ్చని ఉందని అంటున్నారు. అయితే ప్రతిపాదనలు సిద్ధం చేసినా కోర్ట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.  

 

ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయలేమని అభిప్రాయానికి వచ్చే... ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం అంటోంది. ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, డైట్ లెక్చరర్ ల ప్రమోషన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నేతలు. ప్రమోషన్స్ విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. యాజమాన్యాల వారిగా పదోన్నతులు ఉంటాయని...ఏకీకృత సర్వీస్ రూల్స్ తో ముడిపడి ఉన్న పోస్ట్ ల జోలికి పోకుండానే ప్రతి పాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎస్జీటీ లకు స్కూల్ అసిస్టెంట్ లుగా, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్మాస్టర్స్ గా ప్రమోషన్స్ ఉంటాయని కమిషనర్ చెప్పారు. రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని... వాటిని ప్రభుత్వానికి పంపిస్తామని వివరించారు.

 

అన్నీ క్లియర్ అయితే 1500 మంది స్కూల్ అసిస్టెంట్స్ కి హెడ్ మాస్టర్ గా., 5 వేల మంది ఎస్జీటీ లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ రానుంది. ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లో మార్పులు చేస్తే 10 వేల 479 మంది భాషా పండిట్ లకు, పిఈటీ లకు ప్రమోషన్ రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: