చంద్రబాబునాయుడుకు తొందరలోనే పెద్ద షాక్ తప్పేట్లు లేదు. మంగళగిరి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో 2017లో పార్టీ  ప్రధాన కార్యాలయం నిర్మించుకునేందుకు టిడిపికి 3.65 ఎకరాల స్ధలం కేటాయించారు చంద్రబాబు. అంటే పార్టీ కార్యాలయం నిర్మాణానికి భూమి కావాలని అడిగిందీ, భూమిని కేటాయిస్తు నిర్ణయం తీసుకున్నది రెండూ చంద్రబాబే.

 

ఎందుకంటే టిడిపి జాతీయ అధ్యక్షుడు,  అప్పట్లో ముఖ్యమంత్రి రెండు చంద్రబాబే అన్న విషయం తెలిసిందే. ఇపుడా స్ధలాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి మొదలైంది.

 

సరే ప్రతి రాజకీయ పార్టీకి పార్టీ కార్యాలయం నిర్మించుకోవటానికి ప్రభుత్వం భూమి ఇవ్వటం మామూలే. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు లేనట్లుగా పార్టీ కార్యాలయల నిర్మాణం కోసం టిడిపి కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. పార్టీ గెలుచుకున్న ఎంఎల్ఏల సంఖ్య  ఆధారంగా భూములు కేటాయించింది. అంటే కొత్తగా తీసుకొచ్చిన ప్రతి నిబంధన టిడిపికి అనుకూలంగానే తయారు చేసింది. అందుకనే వైసిపి ప్రధాన కార్యాలయం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భూమిని కాకుండా ప్రైవేటు భూమిని కొనుక్కున్నారు.

 

సరే వైసిపి అధికారంలోకి వచ్చింది కదా ఇపుడా భూమిని వెనక్కు తీసుకోవాలని జగన్ కు ఎంఎల్ఏ, ఎంపిలు లేఖలు రాశారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత ఖరీదైన భూమిని పార్టీ కార్యాలయం కోసం తీసుకున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అందుకనే తనకు అందిన ఫిర్యాదును జగన్ రెవిన్యుశాఖ పరిశీలన కోసం పంపారు. సిఎంవో నుండి తనకందిన ఫిర్యాదును ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు.

 

అంటే ఏదో ఓ రోజు పార్టీ కార్యాలయం కోసం జరిగిన భూ కేటాయింపులను ప్రభుత్వం తాజాగా రద్దు చేసినా ఆశ్చర్యం లేదనే అనిపిస్తోంది. అదే జరిగితే వివాదం పెరిగిపోవటం ఖాయం. ఎందుకంటే ఆ భూమిలో టిడిపి ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకున్నది. డిసెంబర్ 6వ తేదీన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

 

ఇటువంటి సమయంలో భూమిని వెనక్కు తీసుకోవాలని అనుకుంటే పార్టీ కార్యాలయ భవనాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వ-టిడిపి మధ్య గొడవ ఖాయమనే అనుకోవాలి.  నిజానికి  ప్రభుత్వానికి అంత మంచిది కూడా కాదు. చూద్దాం ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: