దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అనంతరం...అదే స్థాయిలో...హైదరాబాద్ శివారులోని శంషాబాద్ లో అతి దారుణంగా హత్యకు గురైన‌ వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి  అత్యాచారం, హత్య కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ ఘ‌ట‌న‌పై స్పందించ‌డం, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ విచార‌ణ‌కు ఆదేశించ‌డం దీనికి నిద‌ర్శ‌నం.నిర్భయ తల్లి ఆశాదేవి ప్రియాంక ఘటనపై స్పందించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగటం చాలా బాధకరమన్నారు. 

 

హైదరాబాద్‌లో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంకారెడ్డి ఘటన గురించి విన్నప్పుడు తాను షాక్‌ అయ్యానని నిర్భ‌య త‌ల్లి పేర్కొన్నారు. ఆడపిల్లలు బయటకు వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డలానే ప్రియాంక కూడా మృగాళ్ల చేతిలో బలైపోయిందని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, దోషులకు కఠిన శిక్షలు వేయాలని ఆమె కోరారు. కాగా, అపారమైన దుఃఖంలో ఉన్న ప్రియాంక కుటుంబ సభ్యులకు రాహుల్ గాంధీ ప్రగాఢసానుభూతి తెలిపారు.  ఎవరైనా మరో మనిషిని ఇంతలా భయంకరంగా హింసకు గురిచేయడం దారుణమైన విషయమని రాహుల్ పేర్కొన్నారు. 

 

కాగా, ప్రియాంక‌రెడ్డిని కిరాతకులు దాదాపు ఏడు గంటల పాటు చిత్రహింసలు పెట్టి ఉంటారనే అనుమానం అందరిలో అలజడి రేపుతోంది. ప్రియాంకను లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు కలిసి హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు.. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నలుగురు టీనేజ్‌ వయసు కలిగిన యువకులే కావడంతో అందిరిలోనూ మరింత ఆందోళన కలిగిస్తోంది. లారీ నంబర్ ఆధారంగానే నిందితులను పట్టుకోగలిగారు. ఇదిలాఉండ‌గా, ప్రియాంక ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళ సంఘాలు ధర్నా చేయడమే కాకుండా ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన మినిస్టర్ సత్యవతి రాథోడ్‌ను సైతం అడ్డుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: