బీజేపీ మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగా అవతరించినా మెజారిటీకి కొద్దీ దూరంలో ఆగిపోవడంతో చివరికి అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అధికారం కోసం ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ వ్యూహాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. పొత్తు పెట్టుకున్న పార్టీ అధికారంలో వాటా అడిగింద‌ని...రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిని చీల్చి..స‌ర్కారును ఏర్పాటు చేసిన ఈ ఇద్ద‌రు నేత‌లు...మూడు రోజుల‌కే త‌మ ప్ర‌భుత్వం మూటాముల్లే స‌ర్దుకోవ‌డం అనే స్థితిని ఎదుర్కున్నారు. రాజ‌కీయాల్లో ఇది ఖ‌చ్చితంగా మోదీ-షాకు ఊహించ‌ని షాక్‌ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే, ఇంకో రాష్ట్రంలో ఇలాగే బీజేపీ ప్ర‌భుత్వం కుప్ప‌కూల‌నుంద‌ట‌. ఈ ఎత్తుగ‌డ వేస్తోంది కూడా...మ‌హారాష్ట్రలో షాకిచ్చిన శివ‌సేన పార్టీయేన‌ట‌.



శివసేన తన పాత మిత్రుణ్ని సైతం వదులుకుకొని సెక్యూలర్ పార్టీలైనా ఎన్సీపీ - కాంగ్రెస్ తో చేతులు కలిపింది. మహారాష్ట్రలో అనూహ్యంగా ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మహారాష్ట్రను ఆనుకొని ఉన్న గోవాలో బీజేపీ సార‌థ్యంలో సంకీర్ణ స‌ర్కారు అధికారంలో ఉంది. ఈ స‌ర్కారుపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌హారాష్ట్రలో తరహాలోనే బీజేపీ పాలిత గోవాలోనూ త్వరలో అద్భుతం జరగబోతోందని పరోక్షంగా అక్కడ కూడా కాషాయ‌ ప్రభుత్వాన్ని కుప్ప‌కూలుస్తామ‌ని హెచ్చ‌రించారు.

 

మొదటి నుంచి కూడా బీజేపీ మీద సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కూడా ఈయన చెప్పిందే నిజం అయ్యింది. శివ‌సేన త‌ర‌ఫున దూకుడుగా స్పందించే సంజ‌య్ తామేమీ ఆషామాషీగా ఈ మాట‌లు చెప్ప‌డం లేద‌నే భావ‌న‌ను వ్య‌క్తీక‌రించేందుకు... ఇప్పటికే ‘గోవా ఫార్వర్డ్‌ పార్టీ’ అధ్యక్షుడు విజయ్‌ సర్దేశాయ్‌ శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ‘‘త్వరలో గోవాలోనూ అద్భుతం జరగబోతోందని మేం ఆశిస్తున్నాం. కాంగ్రెస్‌ సహా వివిధ పార్టీలతో కొత్త కూటమిని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నాం. ’’ అని క‌ల‌కలం రేపే కామెంట్లు చేశారు. ఇప్పుడు తమ దృష్టంతా గోవాపైనే ఉందని సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గోవా తరవాత ఇతర రాష్ట్రాలపైనా దృష్టి సారిస్తామని.. దేశవ్యాప్తంగా బీజేపీయేతర కూటమి ఏర్పాటు చేయాలకుంటున్నామని సంజయ్ రౌత్‌ తెలిపారు.త‌ద్వారా, బీజేపీ పెద్ద‌ల‌కు భ‌యం అంటే రుచి చూపించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: