ఇంకా మాన‌వ‌త్వం మ‌న‌లో మంట‌గ‌ల‌వలేదు! క‌నీసం స‌భ్య‌స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకు విష‌యాల్లో అయినా...మ‌నం ఒక్క‌టిగా ఉంటున్నాం. గ‌లం విప్పుతున్నాం. దుర్మార్గుల‌ను చెండాడుతున్నాం. ప్ర‌జా చైత‌న్యం ముందు ఏదీ గొప్ప కాద‌ని నిరూపిస్తున్నాం. ప‌శువైద్యురాలు డాక్టర్‌ ప్రియాంకరెడ్డి ఉదంతంలో ఈ విష‌యం మ‌రోమారు నిజ‌మ‌ని తేలింది. నలుగురు నిందితులు ఆమెను అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులు షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉండడంతో భారీ సంఖ్యలో గ్రామస్థులు, ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థినులు పోలీస్‌స్టేషన్‌ వద్దకు తరలివచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, దారుణానికి పాల్పడ్డ వారిని ఎన్‌కౌంటర్‌ చేయాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని చెదరగొట్టారు. పోలీస్‌స్టేషన్‌ గేటుకు తాళాలు వేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు.

 


షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత కొనసాగుతున్న నేప‌థ్యంలో....పరిస్థితిని షాద్‌నగర్‌, చేవెళ్ల, శంషాబాద్‌ ఏసీపీలు పర్యవేక్షించారు. ఉన్నతాధికారులు షాద్‌నగర్‌కు అదనపు బలగాలను తరలించారు. షాద్‌నగర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు పెద్ద ఎత్తున ఇలా ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో చేర‌డం, తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు ఉండడంతో నిందితులను పోలీసులు బయటకు తీసుకెళ్లే పరిస్థితి లేనందున తహసీల్దార్‌ స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.  షాద్‌నగర్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ అందుబాటులో లేక పోవడంతో పోలీసులు వైద్య పరీక్షల అనంతరం నిందితులను తహసీల్దార్‌ ఎదుట హాజరుపరిచారు. విచారించిన తహసీల్దార్‌ నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు.

 

కాగా, వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డిపై జరిగిన ఘటన హేయమైందని.. సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని.. దోషులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు.  ప్రియాంక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఏ చర్యలైన చేపడుతుందన్నారు. దోషులకు త్వరితగతిన శిక్ష పడేందుకు కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అప్పగించనున్నట్లు తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: