డాక్ట‌ర్ ప్రియంకా రెడ్డి హ‌త్య కేసు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఘాటుగా స్పందిస్తోంది. ఒకే రోజు రెండు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పందించారు. అనంత‌రం న్యాయ‌శాఖ మంత్రి వెంట‌నే ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటు చేశారు. తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రియాంకా రెడ్డి హత్య కేసు విష‌యంలో అధికారుల‌తో చ‌ర్చించారు. కేసు అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. 

 

సీఎం కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక సంచ‌ల‌న కార‌ణాలు ఉన్నాయి. ఇటీవల వరంగల్ లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. దీంతో అదే తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రియాంకారెడ్డి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు.

 

కాగా, డాక్ట‌ర్ ప్రియంకా రెడ్డి హ‌త్య కేసు విచారణను వేగంగా చేపట్టి దోషులకు క‌ఠినంగా శిక్ష‌ప‌డేలా స్పెష‌ల్ కోర్టుని ఏర్పాటు చేయాలని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆదేశించిన నేప‌థ్యంలో ....ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటుపై హైకోర్టుకు ప్ర‌తిపాద‌న‌లు పంప‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.  ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటైన వెంట‌నే రోజు వారీ పద్ద‌తిలో విచార‌ణ జ‌రిపి నిందితుల‌కు త్వ‌రిత‌గ‌తిన శిక్ష ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వ‌ల్ల బాధితులకు  సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ మేర‌కు ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటుపై  న్యాయ శాఖ కార్య‌ద‌ర్శి సంతోష్ రెడ్డితో మంత్రి ఫోన్లో మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: