తెలంగాణాలో జరుగుతున్న వరస సంఘటనలు కేసీయార్ సర్కార్ కి ఊపిరి తీసుకోనీయడంలేదు. ఆర్టీసీ సమ్మె రెండు నెలలుగా సాగి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక ఇపుడు ప్రియాంకారెడ్డిపై జరిగిన అత్యాచారం, హత్యాయత్నం వంటివి మరింతగా ఇబ్బందులో నెట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింది. అంతర్జాతీయ నగరంగా ఉన్న హైదరాబాద్ లో ఇలాంటి ఘటన ఇంతకు ముందు జరగ‌లేదు. దాంతో ఓ విధంగా నిర్భయ తరువాత అంతటి దారుణమైన మారణకాండగా జాతీయ మీడియా ఏకిపారేస్తోంది.

 

ఇంకో వైపు కేటీయార్ కానీ, కేసీయార్ కానీ ఇప్పటివరకూ బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు. దానిపైన కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. జాతీయ చానళ్ళు ఇదే విషయాన్ని పెద్దదిగా చేసి చూపిస్తున్నాయి. చర్చా గోష్టి నిర్వహిస్తున్నాయి. దీంతో మహిళా లోకం సైతం ఆగ్రహంగా ఉంది.

 

మరో వైపు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సైతం కేసీయార్ కనీసంగా స్పందించలేదని గట్టిగానే విమర్శ చేశారు. ఈ పరిణామాల‌ నేపధ్యంలో కేసీయార్ కీలకమైన ప్రకటన ఒకటి చేశారు. ఈ కేసు కోసం ప్రత్యెక కోర్టులని ఏర్పాటు చేయిస్తామని, తొందరగా విచారణ జరిపించి నిందితులకు కఠినంగా శిక్షించేలా చూస్తామని ప్రకటించారు.

 

ఇది ఓ విధంగా కేసీయార్ సర్కార్ నుంచి వచ్చిన గట్టి ప్రతిస్పందనే, ఈ క్రమంలో బాధిత కుటుంబాన్ని కూడా ముఖ్యమంత్రి పరామర్శించడం ద్వారా సర్కార్ మీద వస్తున్న విమర్శల జోరుని తగ్గించుకుంటారని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై స్వయంగా ఇంటికి వెళ్ళి బాధిత కుటుంబానికి తగిన ఓదార్పు ఇచ్చారు. మరో వైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.

 

కొంత వేడి తగ్గాక కేసీయార్ కూడా వెళ్ళి పరామర్శిస్తారని, బాధితులకు తగిన ఓదార్పు ఇస్తారని ప్రచారం అయితే సాగుతోంది. ఇవన్నీ ఇలా ఉంచితే మరో వైపు చట్టాల్లో ఉన్న లోపాల కారణంగానే నిర్భయ సంఘటన తరువాత కూడా ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని మంత్రి కేటీయార్ లేఖ రాయడం విశేషం. ఈ విధంగా బంతిని ప్రధాని మోడీ కోర్టులోకి టీయారెస్ నెట్టిందని కూడా అంటున్నారు. చూడాలి మరి 

 

మరింత సమాచారం తెలుసుకోండి: