తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన డబుల్ బెడ్ రూమ్ పథకంను నిలిపివేసి దాని స్థానంలో కొత్త పథకం తీసుకురానున్నట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో ఇప్పటికే కథనాలు వచ్చాయి. సుమారు రూ 5.50 లక్షలతో తలపెట్టిన ఈ డబుల్ బెడ్ ఇల్లు అంతగా ప్రతిఫలాన్ని ఇవ్వలేదు. అందుకే కెసిఆర్ తన ఎన్నికల ప్రచారంలోనూ సొంత స్థలం కలిగి ఉన్నవారికి ప్రభుత్వం ఇళ్ళు నిర్మిస్తుందని ప్రకటించారు.

 

ఆర్ధిక మాంద్యం, తెలంగాణలో నిధుల లేమి వెరసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని కొనసాగించడానికి ప్రతికూలంగా మారాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో నిర్మించిన ఈ ఇళ్లల్లో ఉండడానికి గ్రామస్థులు ఆసక్తి చూపించట్లేదు. ఊరికి దూరంగా ఉండడం మరియు ఇళ్ళు అగ్గిపెట్టెల్లా ఉండడం వల్ల ప్రజల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై పెద్దగా ఆసక్తి లేదు. ఈ నేపథ్యంలో సీఎం కెసిఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించి త్వరలో కొత్త పథకం రూపొందించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

పాత ఇందిరమ్మ కొత్తగా 

 

కెసిఆర్ ప్రవేశపెట్టబోయే కొత్తగా గృహ నిర్మాణ పథకం గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉన్న ఇందిరమ్మ పథకంలో కొద్ది మార్పులు చేసి తీసుకువస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కొత్తగా పథకం కేవలం గ్రామీణ ప్రాంత ప్రజలకు మాత్రమే వర్తించనున్నట్లు సమాచార. ప్రస్తుతం ఉన్న డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయకుండా పట్టణ ప్రాంత ప్రజలకు కొనసాగించనున్నట్లు తెలిసింది.

 

ఇక కొత్తగా పథకంలో భాగంగా ఒక్క ఇంటికి గానూ ప్రభుత్వం రూ 2.75 లక్షలు మంజూరు చేయనున్నట్లు సమాచారం, సొంత ఇంటి స్థలం కలిగివున్న పేదవారికి రూ 2.75 లక్షలు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇక గతంలో ఆగిపోయిన ఇందిరమ్మ ఇళ్లకు కూడా ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసి ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయనుంది. అప్పట్లో ఇందిరమ్మ ఇళ్లపై సిఐడి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తానని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు అదే పథకాన్ని మళ్ళీ అమలు చేయబోతుండడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: