తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోని హీరోల గురించి జ‌నసేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా తిరుపతిలో తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశాన్ని ‘తెలుగు వైభవం’ పేరిట నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్రాంతి ఐఏఎస్ అధికారి, అవధానులు, పండితులు, ప్రొఫెసర్లు, భాషాభిమానులు పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ గురించి సంచ‌ల‌న కామెంట్లు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో పాండిత్యం రాను రాను దిగజారిపోతోందని ఆయ‌న వ్యాఖ్యానించారు. చాలామంది హీరోల‌కు తెలుగురాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

 

``మన రచయితలకు శాస్ర్తాలు, కావ్యాలు గురించి తెలియవు. మేడసాని మోహన్ వంటి గొప్ప అవధానులను ప్రేరణగా తీసుకుంటే గొప్ప గొప్ప సినిమాలు వచ్చేవి. తెలుగు సినిమా స్థాయి బూతులు, తిట్లు స్థాయికి పడిపోయింది. ఈ స్థాయికి ప్రమాణాలు దిగజారిపోయాయి కనుకే ఆడపిల్లలను రోడ్ల మీదే అత్యాచారాలు చేస్తున్నారు. మాతృభాషను మరచిపోతే వచ్చిన దుస్థితి ఇది. చాలా మంది తెలుగు హీరోలకు తెలుగు మాట్లాడం తెలుసో లేదో నాకు తెలియదు కానీ.. రాయడం మాత్రం సరిగా రాదు. తెలుగు సినిమాలు చేస్తారు. డబ్బులు ఇక్కడే సంపాదిస్తారు కానీ తెలుగు రాయడం, ఉచ్ఛరించడం మాత్రం తెలియదు. ఒక తెలుగు హీరోగా ఇవన్ని ఆవేదన కలిగించాయి. మన భాష, సంస్కృతులను కాపాడుకోలేకపోతే అధోగతి పాలవుతాం.`` అని ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

 

మాతృభాష గురించి జనసేన పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ చేశారు. ``మాతృ భాషను క్షుణ్ణంగా నేర్చుకుంటే ఏ భాషనైనా అవలీలగా నేర్చుకోవచ్చు. తెలుగు భాషను నేర్చుకోవడం ఓం తో మొదలుపెడతాం. దానర్థం పరామాత్ముడు నుంచి విడిపోయావు మళ్లీ పరమాత్ముడి దగ్గరకే చేరాలని ఓంకారంతో భాషను నేర్పుతారు. సుమతి, వేమన శతకాలు చదివితే నైతిక బలం వస్తుంది. తప్పుడు పని చేయాలంటేనే భయమేస్తుంది.`` అని పేర్కొన్నారు.

 

తెలుగు భాష... జ్ఞాన సరస్వతి.. అలాంటి భాషామూలలను చంపేయాలని చూస్తే ఆ జ్ఞాన సరస్వతే.. అపర దుర్గదేవిగా అవతారమెత్తి మిమ్మల్ని సర్వనాశనం చేస్తుందని  పవన్ కళ్యాణ్ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఒకే భాష మాట్లాడే వారికి ఒకే రాష్ట్రం ఉండాలని పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్న నాయకులు.. తెలుగు భాషను పరిరక్షించుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారన్నారు. ఆంగ్ల మాధ్యమానికి జనసేన పార్టీ వ్యతిరేకం కాదని, పిల్లలను ఏ మాధ్యమంలో చదివించాలో తల్లిదండ్రులకే స్వేచ్ఛ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: