ఏవోబీలో మావోయిస్టులను వేటాడేందుకు ప్రయోగాత్మకంగా అత్యాధునిక డ్రోన్లు రంగంలోకి దిగాయి. తొలిసారిగా విశాఖ మన్యం ఆధునిక సాంకేతిక నిఘానీడనలోకి వెళ్లిపోయింది.  పీఎల్జీఏ వారోత్సవాలతో ఏజెన్సీలో హైఅలెర్ట్ కొనసాగుతోంది. వందలాది మందితో కూడిన కూంబింగ్ బలగాలు అడవుల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి. దీంతో వాతావ రణం టెన్షన్...టెన్షన్ గా వుంది.

 

ఏవోబీలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా దూసుకెళ్తున్న విశాఖ పోలీసులు....మరో ముందడుగు వేశారు. నక్సలైట్ల వ్యతిరేక కార్యకలాపాలకు తొలిసారిగా డ్రోన్లను రంగంలోకి దించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా వినియోగించుకొని మావోల  కదలికలు...అనుమానితుల జాడను పసిగట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.  పీఎల్జీఏ వారోత్సవాలను తిప్పికొట్టేందుకు మావోయిస్టు ప్రభా విత ప్రాంతాల్లో డ్రోన్లు, యుఏవీలు సంచరిస్తున్నాయి. రెండు నెలల క్రితం జీకే వీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. పార్టీ తీవ్ర నిర్భందం ఎదుర్కోంటోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2నుంచి 8వరకూ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ-పీఎల్జీఏ వారోత్సవాలను మావోయిస్టు పార్టీ నిర్వహిస్తోంది. వరుస ఎదురుదెబ్బలతో బలహీనపడుతున్న వేళ ఉనికిని చాటుకునేందుకు విధ్వంస చర్యలకు పాల్పడే ప్రమాదం వుందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. చలపతి, అరుణ వంటి అగ్రనేతల సంచారంపై పూర్తి సమాచారం పోలీసుల దగ్గర వుంది. ఈ తరుణంలో మావోయిస్టులను కట్టడి చేసేందుకు ప్రభావిత పోలీస్‌ స్టేషన్ల ప్రాంతాల్లో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్లను రంగంలోకి దించారు. వారపు సంతలు, ప్రధానమైన కూడళ్ళలో సీసీ కెమేరాల నిఘా ఏర్పాటైంది. మావోయిస్టు లతో పాటు సానుభూతి పరులు కదలికలను ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతోంది. పోలీసుల దగ్గర వున్న డేటా బేస్ ఆధారంగా అనుమాతినులను పోల్చి చూస్తున్నారు. ఇప్పటికే క్విక్ రెస్పాన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎవరిపైనైనా అనుమానం కలిగితే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడానికి డ్రోన్లు సమర్ధంగా ఉపయోగపడనున్నాయి. మావోయిస్ట్ కార్యకలాపాల నియంత్రణ కోసం ఈ తరహా ప్రయోగం చేయడం ఇదే తొలిసారి.

 

ఆంధ్రా,ఒడిశా కటాఫ్‌ ఏరియాల్లో ఇప్పటికే వందల మంది గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ పార్టీలకు చెందిన కూంబింగ్ బృందాలు విస్తృతంగా  గాలిస్తున్నాయి. రాయ్ పూర్ కేంద్రంగా పనిచేస్తున్న మానవరహిత విమానం ఇప్పటికే పలుమార్లు ఏవోబీపై చక్క ర్లు కొట్టింది. దండకారణ్యం నుంచి విశాఖ మన్యం వరకూ మావోయిస్టుల కదలికల కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తోంది. దట్టమైన అడవుల్లో సైతం ఎక్కువ మంది సంచారం వుంటే యూఏవీలోని అత్యాధునిక కెమెరా కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. శాటిలైట్ ఇమేజస్ తో పాటు వివిధ మార్గాల్లో సేకరించిన డేటా ఆధారంగా మావోయిస్టులను తరిమివేసేందుకు గట్టిపట్టుదలతో ముందుకు వెళ్తున్నారు విశాఖ పోలీసులు. పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో యాక్షన్‌ టీమ్‌ల కదలికలపై నిఘా అధికంగా వుంది. హిట్‌లిస్టులో ఉన్న రాజకీయనాయకులు మారుమూల ప్రాంతాల్లో సంచరించవద్దని నోటీసులు జారీ అయ్యాయి. గిరిజనుల్లో చైతన్యం రావడం వల్ల ఎదురవుతున్న వ్యతిరేకతను భరించలేకే  ప్రజాకోర్టులు, ఇన్‌ఫార్మర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారనే ప్రచారం బలంగా తీసుకెళ్ళేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆంధ్రా-ఒడిశా పోలీసుల జాయింట్ ఆపరేషన్ లు ముమ్మరమయ్యాయి. కటాఫ్ ఏరియా మావోలకు షెల్టర్ జోన్ గా మారడంతో సాంకేతికతను ఉపయోగించుకుని దళాల కదలికలను పసిగటేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి

 

మరింత సమాచారం తెలుసుకోండి: