ఆంధ్రప్రదేశ్ లో జనసేన బలోపేతమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు  దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో పర్యటించిన జనసేనాని... ఈ రోజు చిత్తూరు జిల్లా కార్యకర్తలతో సమావేశమయ్యారు. వైసీపీని  టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో దిశ ఘటనపైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా... అధికార పార్టీ వైసీపీ రంగులే కనిపిస్తున్నాయని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఒక్క ఏడుకొండల వాడికి తప్ప అన్ని చోట్ల వైసీపీ రంగులే వేశారని తెలిపారు. తిరుపతిలో పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన  ఆయన...అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.  

 

జనసైనికుల బత్తాయి... చీని తోటలను నరికేయటం ప్రభుత్వం మానుకోవాలని పవన్ కల్యాణ్ అధికార పార్టీ నేతలకు హితవు  పలికారు. రాష్ట్రంలో ప్రజలను కులాలవారీగా విభజించి పాలించటం సరికాదని ఆయన అన్నారు. అందరినీ సమదృష్టిలో చూసినపుడే తాను  జగన్ రెడ్డిని సీఎం జగన్ మోహన్ రెడ్డి అని పిలుస్తానని తెలిపారు పవన్ కల్యాణ్.  

 

చట్టాలు కఠినతరం చేస్తేనే సమాజంలో అత్యాచారాలను అరికట్టవచ్చని పవన్ కల్యాణ్ తెలిపారు. నాయకులు బూతులు  మాట్లాడటమే మహిళలపై లైంగికదాడులకు కారణం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు సరైన రీతిలో  ప్రవర్తించినపుడే సమాజంలో మార్పు సాధ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.  సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో దిశ అత్యాచార ఘటన  జరగటం బాధాకరం అన్నారు. మహిళలను గౌరవించాలనే మానసిక పరివర్తన మన ఇంటి నుంచే రావాలని ఆకాంక్షించారు పవన్ కల్యాణ్.  
మొత్తానికి...అధికార వైసీపీపై విమర్శలు సహా...సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అత్యాచార ఘటనల వరకూ తిరుపతి  సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: