ఒక మ‌నిషికి ఉండే అన్ని అవ‌య‌వాలు స‌క్ర‌మంగా ఉంటేనే క‌ష్ట‌ప‌డ‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అలాంటిది ఓ యువ‌కుడు పుట్టుక‌తోనే కాళ్లు, చేతులు లేకుండా పుట్టాడు. అంద‌రిలాగా న‌డ‌వ‌లేడు. మొండి చేత‌ల‌తో ప‌ని చేయ‌లేడు.  కానీ ఫ్యామిలీ కోసం అత‌ని ప‌ట్టుద‌ల మాత్రం మామూలుగా కాదు. సాధారణ మనుషులు చేయగల అన్ని పనులు అతడు చేస్తాడు. చివరికి స్కూటర్ సైతం నడిపేస్తాడు. కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తాడు. ఇంకా ఎన్నో పనులు అతడు అవలీలగా పూర్తి చేసి ఔరా అనిపిస్తాడు.

 

ఇక వివ‌రాల్లోకి వెళితే...అతడి పేరు ఆశిష్. చత్తీస్‌గడ్‌లోని బలరాంపూర్‌లోని శంకరాగడ్ పంచాయతీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. బాల్యం నుంచే కాళ్లు చేతులు లేని అతడు కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఉన్నా.. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదవలేని దుస్థితి అతనిది. దీంతో తనకు తెలిసిన విద్యతో వికలాంగుడి కోటాలో పంచాయతీ ఆఫీసులో ఉద్యోగం సంపాదించాడు. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని నడుపుతున్నాడు.

 

ఈ సందర్భంగా ఆశిష్ మాట్లాడుతూ.. ‘‘నేను పదో తరగతి పాసయ్యాను. నెలకు 10 వేలు జీతం వస్తోంది. కానీ, మా ఇంటి నుంచి ఆఫీసుకు రావాలంటే 15 కిలోమీటర్లు ప్రయాణించాలి. అంత దూరం నుంచి స్కూటర్ నడుపుకుంటూ వస్తాను. నాకు వచ్చే జీతంలో సగానికి పైగా డబ్బు ఈ ఖర్చులకే సరిపోతున్నాయి’’ అని తెలిపాడు.

 

ఆశిష్ తండ్రి మాట్లాడుతూ.. ‘‘ఆశిష్ ఒక్కడు పడే కష్టాన్ని చూడలేక నేను అతడికి తోడుగా వస్తున్నా. మా కుటుంబాన్ని అతడే పోషిస్తున్నాడు. కాళ్లు, చేతులు లేకున్నా.. తనకు అప్పగించిన పనిని సక్రమంగా పూర్తి చేస్తాడు. అని తెలిపారు. బల్రామ్‌పూర్ కలెక్టర్ సంజీవ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ‘‘ఆశిష్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతరులపై ఆధారపడకుండా అన్ని పనులు అతడే పూర్తిచేస్తాడు. అతడికి సాయంగా వస్తున్న తండ్రికి కూడా ఏదైనా ఉపాధి కల్పించాలని సర్కిల్ ఆఫీసర్‌ను కోరాను’’ అని తెలిపారు. చిన్న సమస్యలకే కుంగిపోయే నేటి యువతకు ఆశిష్ జీవితం స్ఫూర్తిదాయకం.

మరింత సమాచారం తెలుసుకోండి: