దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితులకు విధించే శిక్ష‌ణ విష‌యంలో ఉత్కంఠ కొన‌సాగుతోంది. నిందితుల‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ షాద్‌నగర్‌ కోర్టులో ఇప్ప‌టికే పోలీసులు పిటిషన్‌ దాఖలుచేశారు. దిశ హత్యకేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను విచారించేందుకు పదిరోజులు కస్టడీకి అనుమతించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి కస్టడీపై తీర్పును వాయిదా వేశారు. ఇన్‌చార్జి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అందుబాటులో లేకపోవడంతో విచారణను వాయిదావేసినట్టు తెలిసింది. కాగా, నిందితులున్న చ‌ర్ల‌ప‌ల్లి జైలు వద్ద ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీంతో పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 

 


దిశ హ‌త్య‌కేసును వేగంగా విచారించి వారిని త్వ‌రిత‌గ‌తిన ఉరితీయాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు నిన‌దిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ న‌ర‌రూప రాక్ష‌సుల‌ను అందుపులో ఉంచిన చ‌ర్ల‌ప‌ల్లి జైలు వ‌ద్ద కూడా వారిని తీసుకువ‌చ్చిన మొద‌టి రోజు నుంచి నేటి వ‌ర‌కూ ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. మీరు శిక్షిస్తారా? ఉరితీసేందుకు మాకు అప్ప‌గిస్తారా? అంటూ ఆందోళ‌న‌కారులు త‌మ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ త‌రుణంలో....చర్లపల్లి జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే, తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. చ‌ర్ల‌ప‌ల్లి జైలుతో పాటుగా  పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. జైలు పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు నిర్వహించడానికి పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. మ‌రోవైపు దిశ హత్య కేసు నిందితులు అదే జైల్లో ఉండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

 

ఇదిలాఉండ‌గా, దిశ హత్య కేసు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలనే పోలీసుల పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ విషయం తెలుసుకున్న ప్రజలు, మీడియా ప్రతినిధులు పెద్దఎత్తున కోర్టు ఆవరణకు చేరుకున్నారు. దిశ నిందితులకు ఎట్టి పరిస్థితిల్లోనూ న్యాయసహాయం అందించబోమని షాద్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ తీర్మానం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: