ఆంధ్రప్రదేశ్ లో ఓ పోలీసు లాఠీ రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. ఆ లాఠీ చేతపట్టుకున్న టీడీపీ... రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షం అంటూ రోడ్డెక్కుతోంది. రాజధాని పర్యటనలో రాళ్ల ఘటనకు డిపార్ట్ మెంట్ బాధ్యత వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణల నుంచి సిట్ వరకు వెళ్లిన వ్యవహారం ఇప్పుడు...గవర్నర్ వద్దకు చేరింది. చంద్రబాబు పర్యటనలో పోలీసులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు.

 

అటు వైసీపీ.. ఇటు టీడీపీ.. మధ్యలో లాఠీ అన్నట్టుగా ఉంది ఏపీలో రాజకీయం. అమరావతి పర్యటనలో మొదలైన చిచ్చు మరింత పెద్దది అవుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి చంద్రబాబు గత నెల 28న రాజధాని ప్రాంత పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో వెంటక పాలెం అనే గ్రామం వద్ద నిరసనకారులు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు రాళ్లు వేయగా...కొందరు వ్యక్తులు చెప్పులు విసిరారు. ఈ రాళ్లవల్లనే బస్సు అద్దం పగిలింది అని టీడీపీ వాదిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తుంటే నిరసన కారులను ఎందుకు కంట్రోల్ చేయలేదని టీడీపీ ప్రశ్నిస్తోంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని....ప్రభుత్వ అదేశాల మేరకే కుట్ర పూరితంగా దాడికి అవకాశం ఇచ్చారని మండి పడుతోంది. చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడి, పోలీసుల చర్యలపై అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలు.. ఏపీ  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. 

 

చంద్రబాబు పర్యటన గురించి ముందే సమాచారం ఉన్నా.... పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఘటన తరువాత పొలీసు ఉన్నతాధికారుల వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహంతో ఉంది. ఉద్దేశ్య పూర్వకంగా టూర్ ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ బస్సుపైకి పోలీసు లాఠీ వచ్చిన విషయాన్ని టిడిపి పదే పదే ప్రస్తావిస్తోంది.

 

మరోవైపు పోలీసు అధికారుల సంఘం టీడీపీ నేతల విమర్శలను కొట్టి పారేస్తోంది. అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతినేలా టీడీపీ ఆరోపణలు చేస్తుందని సంఘం నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే దాడి అంశంపై టీడీపీ కేంద్ర హోంశాఖకు సైతం ఫిర్యాదు చేసింది. చంద్రబాబు టూర్ లో  దాడి, పోలీసుల వైఫల్యంపై తేల్చాలని సిట్ ఏర్పాటు చేశారు. వారం పది రోజుల్లో సిట్ దీనిపై నివేదికను ఇవ్వనుంది. మొత్తంగా చూసుకుంటే అటు టీడీపీ- ఇటు వైసీపీ మధ్య మొదలైన టూర్ వివాదం...ఇప్పుడు పోలీసు శాఖను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అన్ని స్థాయిలలో టీడీపీ ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కూడా అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: