క్రెడిట్ కార్డు ఈరోజుల్లో ప్రతి వారికి ముఖ్యమైన అవసరంగా మారింది. ఇదే కాకుండా క్రెడిట్ కార్డుల వినియోగం కూడా నానాటికీ పెరిగిపోతోంది. ఇకపోతే క్రెడిట్ కార్డులతో ఎన్ని లాభాలున్నాయో అదేస్థాయిలో సమస్యలు కూడా ఉన్నాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే క్రెడిట్ కార్డులను ఇష్టానుసారంగా ఉపయోగిస్తే.. చివరకు బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇదే కాకుండా క్రెడిట్ కార్డు బిల్లు నిర్దేశిత గడువులోగా చెల్లించలేకపోతే చార్జీల మోత మొదలవుతుంది.

 

 

ఇలా చార్జీలు కూడా చెల్లించకుండా ఉండిపోతే బిల్లు మొత్తం భారీగా పెరుగుతూ వస్తుంది. ఇలా రుణ సంక్షోభంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్‌పై కూడా నెగటివ్ ప్రభావం పడే అవకాశముంది. ఇకపోతే ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులను ఇష్టానుసారంగా వాడేసి ఉంటారు.. బిల్లు చెల్లించకుండా తప్పించుకున్నారు. ఇక నుండి మీరు బిల్లు చెల్లించకుంటే మాత్రం  క్రిమినల్ కేసులు ఎదుర్కోవలసి వస్తుంది. షాకయ్యారా?  నిజమే.

 

 

క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాలి. ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీవో ప్రకారం చూస్తే.. కంపెనీ సెక్షన్ 138 కింద ఏకంగా 19,201 కేసులు నమోదు చేసింది. నేగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఈ కేసులు పెట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ యాక్ట్ 2007 కింద మరో 14,174 కేసులను నమోదు చేసింది. సెక్షన్ 138 కింద సాధారణంగా చెక్ బౌన్స్ అయితే కేసు పెడతారు. అకౌంట్‌లో డబ్బులు లేకపోతే ఎలక్ట్రానిక్ పేమెంట్స్‌ ఫెయిల్ అయితే అప్పుడు పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ యాక్ట్ కింద కేసు పెడతారు.

 

 

ఇకపోతే ఇప్పటివరకు ఎస్‌బీఐ సంస్ద పెట్టిన కేసులను పరిశీలిస్తే.. సెక్షన్ 138 కింద పెట్టిన కేసుల డబ్బు రూ.25 కోట్లుగా ఉంది. ఇదేగాక పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ యాక్ట్ కింద పెట్టిన కేసుల డబ్బు రూ.72.6 కోట్లుగా ఉంది. అంటే సగటున చూస్తే కేసు డబ్బు విలువ వరుసగా రూ.13,290గా, రూ.51,220గా ఉందని అర్థం చేసుకోవచ్చు. అందుకే  క్రెడిట్ కార్డులను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వాడాలి. శక్తికిమించి ఖర్చు చేసి బిల్లు చెల్లించలేక బకాయి పడొద్దు. ఆతర్వాత కేసుల్లో ఇరుక్కోవద్దని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: