లోక్ సభలో ఎంపీల తీరుపై స్పీకర్‌ ఓం బిర్లా అసంతృప్తిగా ఉన్నారు. సభ్యుల హాజరు తగ్గడంపై కినుక వహించారు.  చాలా మంది ఎంపీలు క్వశ్చన్ ఆవర్ లో ప్రశ్నలు అడిగేందుకు తమ పేర్లు ఇచ్చి సభకు హాజరు కాకపోవడం సరికాదంటున్నారు. ఇక ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోవడంతో.. కేంద్రమంత్రికే స్పీకర్‌ చురకలంటించారు. 

 

లోకసభ స్పీకర్ ఓం బిర్లా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. సభ హుందాతనం కాపాడుతూనే .. సభ్యులందరికి అవకాశాలిస్తున్నారు. ప్రశ్నోత్తరాల్లో సీనియర్లకు ఏమాత్రం తగ్గకుండా కొత్త సభ్యులకు తమ గళాన్ని వినిపించే అవకాశమివ్వడంలో ముందుంటున్నారు. సభా నిర్వహణలో కటువుగా ప్రవర్తించడానికి వెనకాడటం లేదు. 

 
సభ జరుగుతున్న సమయంలో సభ్యులు అశ్రద్ధగా ఉంటే సుతిమెత్తగా మందలించడంలో వెనకాడటం లేదు. క్వశ్చన్ ఆవర్ లో శివసేన ఎంపీ హేమంత్‌ తుకారాం గాడ్సే ఓ అనుబంధ ప్రశ్న అడిగారు. అయితే అది వినిపించుకోని వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి రావ్‌సాహెబ్‌ పాటిల్‌ దాన్వే.. మరోసారి ప్రశ్న అడగాలని రెట్టించడంతో ..దాన్వే తీరుపై స్పీకర్ ఓం బిర్లా నిండుసభలో అసహనం వ్యక్తం చేశారు. గౌరవనీయులైన మంత్రిగారూ.. ప్రశ్నలపై శ్రద్ధ పెట్టండి. జాగ్రత్తగా వినండంటూ ఆయనకు చురకలంటించారు.  

 

ఎంపీ తరపున వకాల్తా పుచ్చుకున్న స్పీకర్ ఓంబిర్లా,  తుకారాం గాడ్సేకు మరో అవకాశం ఇచ్చారు. అయితే అదే ప్రశ్నను మళ్లీ అడగకూడదని సభ్యుడికి సూచించారు. స్వీకర్ సూచనను పాటించి శివసేన ఎంపీ మరో ప్రశ్న అడగ్గా.. సహాయమంత్రి దాన్వే పక్కనే కూర్చున్న వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్ లేచి నిల్చుని అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో పాశ్వాన్ ఆరోగ్య రీత్యా కావాలనుకుంటే కూర్చుని కూడా సమాధానాలు చెప్పొచ్చని స్పీకర్‌ సూచించారు.  


గత స్పీకర్ వ్యవహార శైలికి భిన్నంగా దూసుకెళ్తున్న ఓంబిర్లా సమావేశాల జరుగుతున్న వేళ సభ్యుల గైర్హాజరుపై ఒకింత అసహనంగా ఉన్నారు. క్వశ్చన్ ఆవర్ లో ప్రశ్నలు అడిగేందుకు తమ పేర్లు ఇస్తున్న కొందరు సభ్యులు సభకు రాకపోవడాన్ని తప్పు పడుతున్నారు. అలాంటి సభ్యులకు ఈ లోక్‌సభ సమావేశాల్లో మరోసారి ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: