ప్ర‌జల కోసం గొంతును త్యాగం చేసి...జీవితాన్ని ధార‌పోసి..పాల‌కుల తీరును ఎంండ‌గ‌ట్టిన ఓ గ‌లం ఇప్పుడు పాల‌కుల భ‌జ‌న చేస్తానంటోంది. పొట్ట గ‌డిచేందుకు తాత్కాలిక కొలువు ఇప్పించాల‌ని కోరుకుంటోంది. 73 ఏళ్ల వ‌య‌సులో త‌న బ‌తుకు బండి న‌డిచేందుకు స‌ర్కారీ నౌక‌రీ కావాల‌ని ఆశిస్తోంది. ఆ గ‌లం ప్ర‌జా గాయకుడు గ‌ద్ద‌ర్‌ది. తెలంగాణ‌లోని క‌ళాకారుల‌కు అవ‌కాశం ఇచ్చే   తెలంగాణ సాంస్కృతిక సారథికి గద్దర్ దరఖాస్తు చేసుకున్నారు. 

 

తెలంగాణ ఉద్యమానికి తమ ఆటాపాటతో ఊపిరిపోసిన కళాకారులకు చేయూత, ఆర్థిక భరోసా ఇచ్చేందుకు  2014లో ప్రభుత్వం సాంస్కృతిక సారథి అధ్వర్యంలో ఈ ఉద్యోగాల నియామకం చేపట్టింది. 550 మంది కళాకారులను కన్సాలిడేటెడ్‌‌ జీతంపై ఉద్యోగాల్లో నియమించింది. ప్రతినెలా వీరికి రూ.24,146 గౌరవ వేతనం చెల్లించింది. కళాకారుల నియామకాల విషయంలో రూల్స్ పాటించలేదని వచ్చిన ఫిర్యాదులు, పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పుడు కొత్త నియమకాలు చేపట్టింది.  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సాంస్కృతిక సారథిలో కళాకారుల నియామకాలకు ఆన్ లైన్​లో దరఖాస్తులు స్వీకరించింది. అప్లై చేసిన వారందరికీ నవంబరు 25వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గద్దర్​ తనకో కళాకారుడి ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది.

 

దీనిపై గ‌ద్ద‌ర్ స్పందిస్తూ, తనకు ఇప్పుడు 73 ఏళ్లని, ప్రస్తుతానికి ఎలాంటి సర్టిఫికెట్లు తన దగ్గర లేవని, తనకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగానికి అప్లికేషన్​ పెట్టుకున్నది నిజమేనని… కళాకారుడిగా టెంపరరీ ఉద్యోగం అడిగినట్లు గద్దర్​ తెలిపారు. ‘దాదాపు అయిదు వేల మంది కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నేనొక్కడిని. దరఖాస్తు చేసుకోవటంలో తప్పేముంది? నా వృత్తి పాడటమే. నాకు పాడటం వచ్చు. నేను బతకాలి కదా. అందుకే అప్లికేషన్​ పెట్టుకున్నాను. ఉద్యోగమడిగాను కానీ  నేనేం లీడర్​షిప్​ అడగలే.  అందరు కళాకారులతో కలిసి రోజుకు ఎనిమిది గంటలు తిరుగుత. డబుల్​ బెడ్రూం ఇళ్లు.. మూడెకరాల భూమి.. ఆ  స్కిట్లు నేను కూడా చేస్తాను’ అని ప్ర‌క‌టించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: