ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతి నిర్మాణం వైసీపీ...టీడీపీల మధ్య చిచ్చు రేపుతోంది. కేపిటల్ పేరుతో టీడీపీ స్కామ్‌కు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది. అధికార పార్టీ అబద్ధాలు చెబుతోందని టీడీపీ కౌంటర్ ఇస్తోంది.  ఇంతకీ...అమరావతి నిర్మాణాల విషయంలో ఏం జరిగింది?  రెండు పార్టీల  మధ్య జరుగుతున్న మాటల యుద్ధమేంటి ? 

 

 ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ...టీడీపీ పోటాపోటీ సమావేశాలు నిర్వహించాయి. రాజధానిలో చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణాలు...అసలు కోణాలు పేరుతో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం జరిపింది. ప్రజా  రాజధాని అమరావతి పేరుతో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. రెండు పార్టీల మధ్య రాజధాని నిర్మాణంపై మాటల యుద్ధం నడిచింది.  


 
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాజధాని కావాలనే ఉద్దేశంతోనే అమరావతి నిర్మాణం చేపట్టామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని  ఆయన గుర్తు చేశారు. అమరావతిలో ఆదాయం రావాలంటే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో తప్పు జరిగిందని ప్రజలు భావిస్తే తాను క్షమాపణ  చెబుతానన్నారు చంద్రబాబు. 

 

అయితే రాజధాని  అమరావతి పేరుతో టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని మండిపడ్డారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు ఏ పరిస్థితుల్లో హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చారో  అందరికీ తెలుసున్నారు బుగ్గన. మొత్తానికి...రాజధాని నిర్మాణంపై వైసీపీ...టీడీపీ మధ్య మాటల యుద్ధం రౌండ్ టేబుల్ సమావేశాలతో పరాకాష్టకు చేరినట్లయింది. రాజధాని వ్యవహారం ఇప్పట్లో ఆగేలాలేదు. అభివృద్ధి ఆగిపోయిందంటూ టీడీపీ నేతలు.. అది నిజం కాదంటూ వైసీపీ నేతలు ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూనే ఉన్నారు. ఈ వ్యవహారంపై మాటల తూటాలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు టీడీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూనే ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: