నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార వైసీపీని ఏయే అంశాల మీద ఇరుకున పెట్టాలి, వైసీపీ నేతలను అసెంబ్లీలో ఎలా ఎదుర్కోవాలో ఇప్పటికే టీడీపీ పార్టీ చర్చించింది. మరోవైపు వైసీపీ కూడా ప్రతిపక్ష టీడీపీ పార్టీ విమర్శలను ఎలా తిప్పికొట్టాలి అన్నదానిపై ఇప్పటికే ఒక వ్యూహానికి వచ్చినట్లు సమాచారం.

 

జగన్ ఈ ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు చేసిందేమి లేదంటూ జగన్ ఆరు నెలల పాలనను విమర్శిస్తూ టీడీపీ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. ఆపేసాడు, మోసం చేసాడు, కూల్చేశాడు అంటూ ఇలా విమర్శలతో కూడిన ఒక పుస్తకం టీడీపీ పార్టీ విడుదల చేసింది, ఆ పుస్తకంలో చేసిన విమర్శలకు సీఎం జగన్ ను సమాధానం చెప్పమని అడిగే అవకాశం ఉంది.

 

ఈ ఆరు నెలల్లో జగన్ ఏపీని ఏం అభివృద్ధి చేసారు, అమరావతి నిర్మాణాన్ని ఆపడం, ఏపీ ప్రభుత్వ చర్యల వల్ల సింగపూర్ కంపెనీ తప్పుకోవడం, రాష్ట్రంలో పెరిగిన ఉల్లి కొరతను తీర్చకపోవడం ఇలా పలు అంశాలపై జగన్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టాలని టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం.

 

మరోవైపు జగన్ సర్కార్ మాత్రం ఈ ఆరు నెలల్లో ఏపీ కు ఎంతో చేశామని, ఎన్నికల్లో ఇచ్చిన  మాటను నిలబెట్టుకున్నామని, ప్రజలకు అందిస్తామని చెప్పిన అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఈ ఆరు నెలల పాలనలో వందకు 90 శాతం మార్కులు తెచ్చుకున్నామని అసెంబ్లీలో ప్రకటించనున్నట్లు సమాచారం.

 

ఈ మధ్య తెలంగాణలో జరిగిన దిశ ఘటనపై చర్చించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. మహిళా భద్రతపై ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగడంతో ఈ సమావేశాలు ఎలా జరుగుతాయోనని ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: