దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసును తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ తో ముగించారు. నిందితులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టిన దగ్గర నుంచి పోలీసులు ప్రజల చేత ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఎన్‌హెచ్‌ఆర్సీ (జాతీయ మానవ హక్కుల సంఘం) నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టింది. నాలుగు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం అటు దిశ కుటుంబ సభ్యులు, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితుల తల్లితండ్రుల దగ్గర నుంచి వివరాలు సేకరించింది ఇటు పోలీసులనూ సుదీర్ఘంగా ఎన్‌కౌంటర్‌ జరిగిన విధానం గురించి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే దిశ నిందితుల గురించి సంచలన నిజం బయటకి వచ్చినట్లు తెలుస్తోంది.

 

 

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని సమాచారం. నిందితుల వయసు నిర్దారిస్తూ జారీ చేసిన బోనఫైడ్ సర్టిఫికెట్లను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి నిందితుల కుటుంబాలు అందజేసినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరైన జొల్లు నవీన్ కుమార్ బోనఫైడ్ సర్టిఫికెటులో అతని పుట్టినతేదీ 04-04-2004గా నమోదైంది. అంటే ఇతని వయసు 15 సంవత్సరాలా 8 నెలలు. అలాగే మరో ఇద్దరి నిందితుల పుట్టిన తేదీలు 15-08-2002, 10-04-2004 గా బోనఫైడ్ సర్టిఫికెట్స్ లో నమోదు అయ్యాయి. దీనితో నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని తెలిస్తోంది. మరోవైపు పోలీసులు మాత్రం నిందితులు తమకు 20 సంవత్సరాలకు పైగానే వయసు ఉంటుందని చెప్పారని పోలీసులు చెప్పారు, ఆధార్ కార్డు లోనూ నిందితుల పుట్టిన సంవత్సరం 2001 గా నమోదు అయింది.

 

 

దీనితో పరస్పర విరుద్ధంగా ఉన్న సర్టిఫికెట్సులో ఏ పుట్టినతేదిని ప్రామాణికంగా తీసుకోవాలోనని ఎన్‌హెచ్‌ఆర్సీ సందిగ్ధంలో ఉంది. అయితే సాధారణంగా బోనఫైడ్ సర్టిఫికెటులో ఉన్న పుట్టినతేదినే ప్రామాణికంగా తీసుకుంటారని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు చిక్కులు తప్పవు. ఇక దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సీపీ సజ్జనార్ ఢిల్లీ వెళ్లారు. సుప్రీం ఈ ఎన్‌కౌంటర్‌పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: