ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. మహిళా సిబ్బందికి రాత్రి వేళల్లో డ్యూటీలు వేయొద్దని కేసీఆర్ ఆదేశించడంతో అన్ని డిపోల్లో మహిళల విధుల సమయాలను మార్చేశారు అధికారులు. త్వరలోనే మహిళా సిబ్బందికి విశ్రాంతి గదులతో ఏర్పాటు, యూనిఫామ్ మార్పు చేయనుండటంపై ఉద్యోగినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను.. ఒకొక్కటిగా యాజమాన్యం పరిష్కరిస్తూ వస్తుంది. నిర్దేశించిన సమయంలోగా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆదేశించడంతో.. తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీలో పనిచేసే మహిళా ఉద్యోగుల డ్యూటీ టైమింగ్ ను పూర్తిగా సవరించారు. ఇప్పటి వరకు రాత్రి పది, పదకొండు గంటల వరకు కూడా విధులు నిర్వహిస్తూ వచ్చిన మహిళా కండక్టర్లు.. ఇక మీదట రాత్రి 8 గంటల లోపే విధులు ముగించే అవకాశాన్ని కల్పించారు.

 

మహిళ కార్మికులకు డ్రెస్‌కోడ్‌ కూడా మార్చాలని యాజమాన్యం భావిస్తోంది. ఖాకీ డ్రెస్‌ స్థానంలో మరో రంగు డ్రెస్‌ ధరించేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించడంతో ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. మహిళా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న యాజమాన్యం చెర్రీ రంగు యాప్రన్‌ డ్రెస్‌ను కన్ఫర్మ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఉద్యోగినికి రెండు డ్రెస్‌ల చొప్పున మొత్తం 9వేల వరకు యాప్రన్లు సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు కూడా మూడు నెలల పాటు చైల్డ్‌కేర్‌ లీవ్స్‌పై రెండ్రోజుల్లో ఆదేశాలు ఇవ్వనున్నారు. డిపోలవారీగా మహిళలకు టాయిలెట్లు, డ్రెస్‌చేంజ్‌ గదులను తాత్కాలికంగా ఏర్పాటుచేస్తున్నారు.

 

యూనియన్లతో సంబంధం లేకుండా కార్మికుల సంక్షేమం కోసం బోర్డును ఏర్పాటు చేసేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ప్రతి డిపో, డివిజన్‌, రీజియన్‌ నుంచి ప్రాతినిధ్యం ఉండనుంది. డిపో నుంచి ఇద్దరి చొప్పున ఎంపిక చేయటం వల్ల క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకోవటం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. బోర్డు ఏర్పాటు, పనితీరు, బాధ్యతలు ఎలా ఉండాలనే అంశాలపై అధికారులు సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఉద్యోగుల తల్లిదండ్రులకు బస్‌పాసులు ఇచ్చేందుకు రెండ్రోజుల్లో ఆదేశాలు జారీకానున్నాయి.

 

సమ్మె కాలంలో మృతి చెందిన కార్మిక కుటుంబాల్లో ఒక్కొక్కరి చొప్పున మొత్తం 38 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. మృతి చెందినవారి కుటుంబీకులకు ప్రభుత్వం తరఫున 2లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేశారు. 296 మంది డ్రైవర్లు, 63 మంది కండక్టర్లను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. రెండు రోజుల్లో ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్‌పాసులు కూడా ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: