పసిడి ప్రియులకు భారీ శుభవార్త. వరుసగా ఏడో రోజు కూడా జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 40 రూపాయలు తగ్గగా మొత్తంగా బంగారం ధర కాస్తా 39,000 రూపాయలకు క్షీణించింది. అదే జాతీయ మార్కెట్లో అయితే దీని ధర దాదాపు 2 వేలు తక్కువగా అనగా 37 వేల రూపాయలకే ఉండడం గమనార్హం. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ దానితో పాటు దేశీ జువెలర్లు మరియు కొనుగోలుదారుల నుండి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.

 

బంగారం ధర ఇలా ఉండగా వెండి ధర కూడా పసిడి వెంటనే నడిచింది. కేజీ వెండి ధర దాదాపు వంద రూపాయలు తగ్గింది. దీంతో వెండి ధర 47 వేల రూపాయలకు తగ్గిపోయింది. ఇకపోతే దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో మాత్రం బంగారం ధర మరింత తక్కువ పడిపోవడం విశేషం. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలాంటి మార్పు లేకపోగా 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 36 వేల రూపాయలకు పడిపోయింది. ఢిల్లీలో కూడా వెండి ధర భారీగా తగ్గుముఖం పట్టడం విశేషం.

 

ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది. సాధారణంగా ఈ ఏడాది చివరికల్లా చైనాతో అమెరికా వాణిజ్య డీల్ ఓకే కావొచ్చనే అంచనాలు ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చాయి. డిసెంబర్ 15 నుంచి చైనా దిగుమతులపై అమెరికా కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. ఈలోపు డీల్ ఓకే కావొచ్చని అందరూ భావిస్తున్నారు. అందుకే బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో కేజీ వెండి ధర 0.09 శాతం తగ్గింది. రూ.43,465 స్థాయికి దిగొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: