ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. రాజధాని మార్పు వివాదం రగులుతూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం తాత్కాలికంగా జరిగిందని రాజధాని మార్పు చేస్తామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సంచలనం సృష్టించాయి. జగన్ ప్రభుత్వం తీసుకున్న రాజధాని మార్పు నిర్ణయం సరైనది కాదని... రాజధాని మార్పు అనేది హేయమైన చర్య అంటూ విపక్ష పార్టీలన్ని జగన్ సర్కార్ పై విమర్శలు కూడా గుప్పించారు. అటు ప్రజల్లో కూడా రాజధాని మార్పు పై అయోమయం ఏర్పడింది. రాజధాని మార్పు చేస్తారా లేక అమరావతిలోని రాజధానిని కొనసాగిస్తారా అన్నది ప్రజలకు  కూడా ప్రశ్నార్థకంగా మారింది. 

 


 ఈ నేపథ్యంలో రాజధాని మార్పు లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో రాజధాని మార్పు పై స్పష్టత ఇవ్వాలంటూ టీడీపీ నేతలు ప్రశ్నించగా.. ఏపీ రాజధాని అమరావతి అని మార్చే ఆలోచన జగన్ ప్రభుత్వానికి లేదని వ్రాతపూర్వకంగా స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. గతంలో కూడా తాను రాజధాని మారుస్తానని చెప్పలేదని కేవలం రాజదానిలో అభివృద్ధి జరగలేదని మాత్రమే అన్నానని... విపక్ష పార్టీల నేతలు తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ అసెంబ్లీ వేదికగా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు . 

 

 ఇదిలా ఉంటే రాజధాని మార్పు అంశంపై మంత్రి బొత్స యుటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని మార్పు అంశంపై ఓ కమిటీని వేస్తామని ఆ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాతనే దాన్ని అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత రాజధాని మార్పు పై నిర్ణయం తీసుకుంటామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం ఆంధ్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే గతంలో బొత్స సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాజాగా అసెంబ్లీలో రాజధాని మార్పు లేదని చెప్పినప్పటికీ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రాజధాని మార్పు జరుగుతుందా లేదా అన్నది మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా శాసనమండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స ఈ రకంగా వ్యాఖ్యానించారు. కమిటీ నివేదించిన రిపోర్టు బట్టి  రాజధాని మార్పు ఉంటుందా లేదా అనేది నిర్ణయిస్తామని అనటంతో  మరోసారి రాజధాని మార్పు ప్రశ్నార్థకంగానే మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: