అనుకున్నట్టే అయింది. రాజధానిపై మండలిలో ఇలా స్పష్టత ఇచ్చారో.. లేదో.. అప్పుడే మంత్రి బొత్స మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. నిపుణుల కమిటీ నివేదిక తర్వాతే కేపిటల్ పై క్లారిటీ అంటూ మెలిక పెట్టేశారు. మొత్తంగా రాజధాని విషయంలో ఉన్న అనుమానాల విషయంలో కథ మళ్లీ మొదటికి వచ్చినట్టైంది.


రాజధానికి రాజకీయానికి ఫుల్ స్టాప్ పడిందనుకుంటే.. లేదు లేదు కామానే పెట్టానని తూచ్‌ చెప్పేశారు మంత్రి బొత్స. దాదాపు రెండు నెలల నుంచి రాజధాని అమరావతిలో కొనసాగుతుందా..? లేక వేరే ప్రాంతానికి తరలి వెళ్తుందా..? అనే విషయమై పరిపాలన వర్గాల్లోనూ.. రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రుల దగ్గర నుంచి క్లారిటీ రాకపోవడం, సీఎం మౌనం వహించడంతో.. అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజధానిలో రైతులు కూడా రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీ ఆందోళనలు చేశారు. కానీ శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో చర్చకు తెరపడిందని అందరూ అనుకున్నారు. కానీ మంత్రి బొత్స మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. 

 

శాసన మండలిలో టీడీపీ సభ్యురాలు అమరావతిలో రాజధానిని కొనసాగిస్తున్నారా..? లేదా అనే అంశంపై వేసిన ప్రశ్నకు రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందనే రీతిలో మంత్రి బొత్స సమాధానం ఇచ్చారు. దీంతో అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తారని అంతా అనుకున్నారు. అయితే ఇంతలోనే మంత్రి బొత్స ఈ మొత్తం వ్యవహరాలకు అతి పెద్ద ట్విస్ట్‌ ఇచ్చారు. తానిచ్చిన సమాధానంతో ఫుల్‌ స్టాప్‌ పడిందని ఎలా అనుకుంటారన్నట్టుగా కామెంట్ చేశారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చాకే.. రాజధానిపై స్పష్టత వస్తుందని తేల్చి చెప్పారు బొత్స.


ప్రస్తుతం రాజధాని ఉన్న ప్రాంతంలో కట్టడాలను నిర్మించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఉందని.. చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తున్నారు బొత్స. ఇదే సందర్భంలో సీఎం జగన్‌ ఇటీవల నిర్వహించిన ఓ సమీక్షలో రాజధాని ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న కట్టడాల కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టాలని సూచించారు సీఎం. దీంతో రాజధాని విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందనే భావన వ్యక్తమైంది. అయితే తాజా ఎపిసోడుతో మళ్లీ సందిగ్ధత మొదలైంది.


ఇక మండలిలో బొత్స చెప్పిన సమాధానాన్ని కూడా పూర్తిగా తప్పు పట్టలేని పరిస్థితి. రాజధానిని అమరావతి నుంచి మారుస్తారా..? అంటే లేదనే సమాధానం ఇచ్చారు మంత్రి. రాజధాని పరిధి వచ్చేసరికి ప్రస్తుతం అసెంబ్లీ, సెక్రటేరీయేట్ ఉన్న వెలగపూడి, తుళ్లూరు, ఉద్దండరాయుని పాలెం వంటి గ్రామాలే కాకుండా.. తాడేపల్లి, మంగళగిరి వంటి ప్రాంతాలు కూడా వస్తాయి. రాజధానిని ప్రస్తుతమున్న ప్రాంతంలో కొనసాగించడం ప్రభుత్వానికి ఇష్టం లేకుంటే.. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలకు తరలించినా తరలించొచ్చనేది ప్రభుత్వ వర్గాల్లో చాలా కాలంగా జరుగుతున్న చర్చ. ఈ క్రమంలో తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలు కూడా అమరావతి పరిధిలోకే వస్తాయి కాబట్టి.. రాజధాని అమరావతి నుంచి తరలి వెళ్లిందని చెప్పడానికి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునైనా మంత్రి బొత్స తెలివిగా ఈ సమాధానం ఇచ్చి ఉంటారని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తానికి రాజధాని విషయంలో అనేక ట్విస్టులు ఇస్తున్న బొత్స ఇప్పుడు మరో ట్విస్ట్‌ ఇవ్వడం ద్వారా కన్ఫ్యూజన్ కంటిన్యూ చేస్తున్నారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: