ఏపీ అసెంబ్లీలో పోరాటానికి టీడీపీకి సొంత వారినుంచే మద్దతు కరువైంది. పార్టీకి ఉన్న 23 మంది సభ్యుల్లో మూడో వంతు మంది అంటీముట్టనట్టు ఉంటున్నారు. కొందరు అసెంబ్లీకే డుమ్మా కొడుతుంటే... మరికొందరరు వచ్చి కూడా నోరు మెదపడం లేదు. దీంతో అరడజను మంది తోనే చంద్రబాబు నెట్టుకు రావాల్సి వస్తోంది.

 

టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చంద్రబాబుతో కలిసి రావడం లేదు. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ.. బలమైన అధికార పక్షాన్ని ఢీకొట్టడానికి వ్యూహాలు రెడీ చేసింది. ఎవరు ఏ అంశాలు లేవనెత్తాలో కూడా మీటింగులు పెట్టి మరీ చంద్రబాబు హితబోధ చేశారు. కానీ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు... సొంత పార్టీలోనే పరాయివారిగా వ్యవహరిస్తున్నారు. 


టీడీపీకి సభలో అంతా ఓ అరడజను మందే చూసుకోవాల్సి వస్తోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే పార్టీ వీడారు. టిడిపి తో విబేదించిన వంశీని ప్రత్యేకంగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే సభలో టిడిపి సభ్యులతోనే కలిసి ప్రస్తుతం కూర్చుంటున్న వంశీ...సభలో వైసీపీ సభ్యులకు ఉపయోగ పడేలా వ్యూహరచన చేస్తున్నారు. శుక్రవారం సభకు వచ్చిన గంటా....ఒక అతిథిలా వచ్చి వెళ్లారు. గంటా టీడీపీలోనే ఉన్నాడు అని చెప్పేందుకు సభకు వచ్చినట్లు ఉంది తప్ప....ఒక పార్టీ సభ్యునిగా ఆయన తన పాత్రను పొషించే ప్రయత్నం చేయడం లేదు. 

 

మొదటి రోజు సభకు వచ్చిన గొట్టిపాటి రవి తరువాత సభకు కూడా హాజరు కాలేదు. తాను టీడీపీలోనే ఉన్నాను అని చెప్పేందుకు మాత్రమే గొట్టిపాటి రవి సభకు వచ్చినట్లు ప్రచారం జరగుతుంది. పార్టీ సీనియర్ నేత, వ్యూహాలు పన్నడంలో దిట్టగా పేరున్న పయ్యావుల కేశవ్ కూడా సభకు రావడం లేదు. డాక్టర్ల సూచన మేరకు పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. దీంతో సభలో కీలకంగా ఉండా సభ్యుడైన పయ్యావుల లేక పోవడం కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది. బాల కృష్ణ సంగతి సరే సరి. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, రామా నాయుడు, బుచ్చయ్య చౌదరి, వెలగపూడి గట్టిగా ఫైట్ చెయ్యాల్సి వస్తోంది. సభలో టిడిపికి చంద్రబాబు తరవాత అచ్చెన్నాయుడు కీలకంగా మారగా....ఆయా అంశాలలో గట్టిగా మాట్లాడుతూ రామానాయుడు కూడా గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఇక ప్రతిపక్షం డిఫెన్స్ లో పడుతుంది అనుకునే సమయంలో ఆరో సారి గెలిచి సభకు వచ్చిన బుచ్చయ్య చౌదరి పార్టీని అండగా నిలుస్తున్నారు. దీంతో అధికార పార్టీ కూడా ఈ ముగ్గురిపైనే ప్రధానంగా దృష్టిపెట్టి కట్టడి చేస్తోంది. 

 

సినీయర్ నేతలు కరణం బలరాం, చిన రాజప్ప సభకు వస్తున్నా.. గళం విప్పడం లేదు. యువనేతలు ఉన్నా  పార్టీకి వీరు గళం కాలేకపోతున్నారు. అధిష్టానం కూడా సభ లో పరిస్థితుల దృష్ట్యా సీనియర్లతోనే ఎక్కవ కౌంటర్ ఇప్పస్తుంది. వీరాంజనేయ స్వామి, జోగేశ్వరావు వంటి నేతలు సభలో గట్టిగా ఎదురుదాడి చేయలేని పరిస్థితి. సభలో ప్రతిపక్షాన్నికట్టడి చేసేందుకు అధికారపక్షం అన్ని అస్త్రాలు ప్రయోగిస్తోంది. తీవ్ర స్థాయి ఆరోపణలు, దూషణలతో టీడీపీని, అధినేతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తమ అధినేతకే మైక్ దొరకని పరిస్థితుల్లో... ఇక తమకు ఏం ఛాన్స్ వస్తుందని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: