దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్ పై రోజుకొకరు ఒక్కొక్క స్పందనను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నిందితులను ఎన్‌కౌంటర్ చేసి మంచి పని చేసారని పోలీసులను ప్రభుత్వాన్ని మెచ్చుకుంటుండగా ఇంకొంత మంది మాత్రం నిందితులకు కోర్టు ద్వారా శిక్ష పడితే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై అధికార పార్టీ ఎమ్యెల్యేలు కానీ, మంత్రులు కానీ స్పందించలేదు.

 

దిశ ఘటనపై మొట్టమొదటి సారిగా మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన అనంతరం మానవ వికాస వేదిక మహా సభ లో ప్రసంగిస్తూ దిశ ఘటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం లాంటి ఘటనల్లో నిందితులను చంపడం, ఉరిశిక్షలు వేయడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. దిశ ఘటనపై అందరూ వ్యక్తం చేస్తున్న అభిప్రాయానికి బిన్నంగా స్పందించారు మంత్రి. కేవలం సమాజంలో మార్పు ద్వారానే దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడొచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఇంకా మూఢనమ్మకాలు, మంత్రాల నెపంతో చంపుకోవడం దారుణం అన్నారు. ఇంత అద్భుతమైన టెక్నాలజీని మానవ శ్రేయస్సు కోసం వినియోగించాలని అభిలషించారు. కొన్ని సందర్భాల్లో కంచే చేను మేసినట్లుగా సొంత తండ్రులే తమ పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరుగుతున్న ఘటనల వల్ల తల్లితండ్రులు భయపడుతున్నారని తమ పిల్లలు బయటకి వెళ్లి క్షేమంగా తిరిగి వస్తారో రారోనని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సమాజంలో మార్పు తేవాలని నాగరికత గల సమాజంలో మనిషికి, జంతువుకి మధ్య తేడా తెలుసుని ప్రవర్తించాలని హితవు పలికారు. డా.అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని నిర్మించాలని ఆశించారు మంత్రి ఈటెల రాజేందర్.

మరింత సమాచారం తెలుసుకోండి: