మసాలా దోశ రూ 6, హైదరాబాద్ బిర్యాని రూ 13, చికెన్ కర్రీ రూ 20 మాత్రమే అబ్బబ్బా ఈ ధరలు ఎక్కడో చెప్పండి వెంటనే వెళ్లి తినేస్తాం అంటారా?, ఈ ధరలు నిజమే కానీ ఇవి మన కోసం కాదు. మన దేశ ఎంపీలకు పార్లమెంట్ కాంటీన్లో అందించే ధరలు. అవునండీ మన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు సబ్సిడీ కింద ఆహార పదార్ధాలను అతి తక్కువ ధరలకు అందిస్తున్నారు, ఎంత తక్కువ అంటే ఈ ధరలు బయట ఉన్న ధరల కంటే దాదాపు 80 శాతం తక్కువ. గత ఐదు ఏళ్లలో ఈ సబ్సిడీ ధరలు చెల్లించడానికి ప్రభుత్వం రూ 60 కోట్లను వెచ్చించిందని సమాచారం.

 

యేటా ఎంపీల ఆహార పదార్ధాల సబ్సిడీ కింద ప్రభుత్వం రూ 17 కోట్లను ఖర్చు చేస్తోంది. ఎంపీల్లో దాదాపు 90 శాతానికి పైగా కోటీశ్వరులే కావడంతో ఈ సబ్సిడీని ప్రజలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలోనూ 'పేద ఎంపీలు' అంటూ నెటిజన్స్ ఆహార సబ్సిడీపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో లోక్‌సభ స్పీకర్ గా ఉన్న సుమిత్రా మహాజన్ పార్లమెంట్ కాంటీన్ లాభనష్టాలపై పని చేయదని, అయినా అసలు ధరలకే ఆహారాన్ని అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం మాత్రం అమల్లోకి రాలేదు.

 

తాజాగా ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సబ్సిడీపై ఒక నిర్ణయం తీసుకోవాలని భావించారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి ఆహార పదార్ధాల సబ్సిడీ ఏ మేరకు అవసరమో చర్చించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత పార్లమెంట్ కాంటీన్లో ఆహార పదార్ధాలపై సబ్సిడీని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎంపీలు కూడా బయట ఉన్న ధరలకే ఆహార పదార్ధాలను కొనుక్కోవాల్సి ఉంటుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మంచి నిర్ణయం తీసుకున్నారని నెటిజన్స్ సైతం ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: