ఎలాంటి తప్పు చేయని తనపై అభిశంసన చర్యలు చేపట్టడం అన్యాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. తన నాయకత్వంలో దేశం అద్భుతంగా రాణిస్తోందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. అభిశంసనకు కాంగ్రెస్‌ కమిటీ చర్యలు ప్రారంభించిన తరుణంలో ట్రంప్ స్పందించారు. 


కొందరు తనను కావాలనే వెంటబడి వేధిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వారి చర్యల్లో భాగంగానే ఇప్పుడు తనపై అభిశంసనకు దిగారని ట్రంప్ మండిపడ్డారు. దేశం కోసం ఎంతో చేస్తున్న తనను దిగిపోవాలనే స్థాయికి దిగడం అన్యాయం అని స్పందించారు. అభిశంసన కేవలం వేధింపు చర్య అని, తన హయాంలో దేశం చాలా బాగా ముందుకు సాగుతోందన్నారు. మరి ఎందుకొచ్చిన అభిశంసన అని ప్రశ్నించారు. ప్రెసిడెంట్‌పై అభిశంసనకు సంబంధించిన రెండు అధికరణలకు కీలకమైన చట్టసభల కమిటీ ఆమోదం తెలిపింది. విపక్ష డెమోక్రాట్లది విద్వేష పార్టీ అని ట్రంప్ విమర్శించారు. కొద్ది గంటల వ్యవధిలోనే ట్రంప్‌ ఏకంగా 123 ట్వీట్లు చేశారు. 


ట్రంప్ అభిశంసనకు అనుమతి లభించడంతో ఇక ఈ అంశం ప్రతినిధుల సభ పరిశీలనకు వెళ్లుతుంది. ప్రతిపక్ష డెమోక్రాట్ల ఆధిక్యత ఉన్న ప్రతినిధుల సభలో అభిశంసనకు ఆమోదం దక్కితే, ఆ తరువాత అభిశంసన చర్య సంబంధిత చర్యలపై వంద మంది సభ్యుల సెనెట్ పరిశీలన జరుపుతుంది. సెనెట్‌లో ట్రంప్ అధికారపక్షం రిపబ్లిక్ పార్టీ ఆధిక్యత ఉంది. దీనితో అక్కడ అభిశంసన వీగిపోతుందనే భావిస్తున్నారు. ప్రతిపక్షాల వైఖరి దారుణంగా ఉందని ట్రంప్ ఘాటుగా విమర్శించారు.


లెఫ్టిస్ట్ భావజాలాలున్న డెమొక్రాట్లు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని ట్రంప్ ట్వీట్ చేశారు. దేశానికి డెమొక్రాట్లు ప్రమాదంగా అవతరిస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు తనపై వచ్చిన అభిశంసన తీర్మానం రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు పన్నిన కుట్రగా ట్రంప్ అభివర్ణించారు. ఈ కుట్ర వాస్తవానికి ఇప్పుడు ప్రారంభమైనది కాదని ఎప్పటి నుంచో ఇది జరుగుతోందని ట్రంప్ వైట్ హౌజ్‌లో వ్యాఖ్యానించారు.అభిశంసన తీర్మానం కేవలం అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడే వినియోగిస్తారని గుర్తుచేశారు. ఇలా జరిగి చాలా ఏళ్లు అయ్యిందని ట్రంప్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: