టీఆర్ఎస్ పార్టీ యువనేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కే తారకరామారావుకు సరిగ్గా ఏడాది క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. పార్టీ బాధ్యతలను స్వీక‌రించి ఏడాది పూర్త‌యిన త‌రుణంలో స‌హ‌జంగానే కేటీఆర్ ఏడాది నాయ‌క‌త్వంపై చ‌ర్చ జ‌రుగుతుంది. పార్టీ వ‌ర్గాల అభిప్రాయం ప్ర‌కారం, కేటీఆర్ త‌న‌పై అంచ‌నాల‌ను నిల‌బెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తూ, క్యాడర్‌కు దగ్గరై.. నాయకత్వంతో సమన్వయం చేస్తూ పార్టీని స‌మ‌న్వ‌యం చేస్తున్నార‌ని అంటున్నారు. పార్లమెంట్, పంచాయతీ, పరిషత్ ఎన్నికలతోపాటు హుజుర్‌నగర్ ఉపఎన్నికలో పార్టీ విజయబావుటా ఎగుర‌వేయ‌డంలో ఆయ‌న‌ది కీల‌క పాత్ర అని పేర్కొంటున్నారు.అయితే, ఒక్క విష‌యంలో మాత్రం కేటీఆర్ లెక్క త‌ప్పింద‌ని విశ్లేషిస్తున్నారు. 

 

కేటీఆర్ ఏడాది నాయ‌క‌త్వంలో కీల‌క‌మైన‌ది హుజూర్‌నగర్ ఉపఎన్నిక విజయం అని విశ్లేష‌కులు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ప‌రువు స‌మ‌స్య‌గా మారిన ఈ ఎన్నిక‌లో పార్టీ వాణిని ప్రజలవద్దకు తీసుకుపోయేలా కేటీఆర్ చేసిన వ్యూహరచన ఫలితాన్నిచ్చింది. తొలుత రోడ్‌షో నిర్వహించిన కేటీఆర్.. టెలికాన్ఫరెన్సుల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, కార్యకర్తలకు సూచనలు చేస్తూ ముందుకు నడిపించడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు. ఇదే ఊపుతో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించేలా పార్టీని కేటీఆర్ సర్వసన్నద్ధంచేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా ఇప్పటికే ఇంచార్జిలను నియమించారు. 

ఢిల్లీలో కూడా పార్టీ త‌ర‌ఫున టీఆర్ఎస్‌ ఎంపీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స‌మ‌న్వ‌య బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారంటున్నారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు టీఆర్ఎస్ ఎంపీల‌తో ప్రత్యేకంగా సమావేశమై  కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలను వివరిస్తూ వారికి సమాచారాన్ని అందించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు వివిధ బిల్లులు, రిజర్వేషన్ల అంశంలో  దిశానిర్దేశం చేశారు.

 

అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ముఖ్య‌మైన పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌మి పాల‌వ‌డం కేటీఆర్ కెరీర్‌ను ప్ర‌భావితం చేసేందంటున్నారు. టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచిన‌ప్ప‌టికీ బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొంద‌డం, కాంగ్రెస్ మూడు స్థానాల్లో  విజ‌యం సాధించ‌డం టీఆర్ఎస్‌ను ఇరుకున ప‌డేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: