తెలుగు రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఇక రాజకీయాల్లో అవుట్‌డేటెడ్ అయిపోయారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, అన్ని వర్గాలకూ చేరువవుతున్న జగన్ ప్రభుత్వ దూకుడు చూస్తుంటే ఇలాంటి సందేహాలే తెరపైకి వస్తున్నాయి.
అసెంబ్లీలో టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ, కేవలం ఐదారుగురు మాత్రమే బాబు వెనుక నిలుస్తున్నారు. అటు లోకేష్‌ను యువనేతగా తెరపైకి తీసుకురావాలన్న బాబు ఆశ ఆవిరయిపోయింది. ఈ శాసనసభ సమావేశాల్లో అధికార వైసీపీ... బాబుకు ఇక వయసయిపోయింది. ఆయన విశ్రాంతి తీసుకోవడం మంచిదన్న వాదనను విజయవంతంగా జనంలోకి తీసుకువెళ్లగలిగింది.

 

టిడిపికి తొలి నుంచీ దన్నుగా ఉన్న యువత గత ఎన్నికల్లో దూరమయింది. నిరుద్యోగభృతి హామీ ఇచ్చి, దానిని ఎన్నికల ముందు అమలుచేయడమే దానికి కారణం. పైగా గత ఎన్నికల్లో యువత వైసీపీ అధినేత జగన్‌ను యూత్‌ఐకాన్‌గా చూశారే తప్ప, నారా లోకేష్‌ను ఆవిధంగా గుర్తించలేదు. అంతకుముందు ఎన్నికల్లో అనుభవజ్ఞుడైన బాబుకు అవకాశమిద్దామని భావించిన జనం టిడిపికి పట్టం కడితే, ఈ ఎన్నికల్లో యువకుడైన జగన్‌కు ఒకసారి అధికారం ఇచ్చి చూద్దామని భావించి వైసీపీని గెలిపించారు. గత ఎన్నికల్లో యువతరం 80 శాతం వైసీపీ వైపే మొగ్గింది. ఎన్నికల తర్వాత టిడిపి యువతకు స్థానం కల్పించే ఆలోచన చేయకపోవడం, కొత్త తరాన్ని ప్రోత్సహించకపోవడంతో టిడిపి తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ సహా, ఎంతోమంది యువనేతలు వైసీపీలో చేరిపోయారు.

 

చంద్రబాబునాయుడుకు వృద్ధాప్యం సమీపిస్తుండటం, పార్టీ నేతలపై బాబు పట్టు తప్పుతుండటం, అటు లోకేష్ అనుభవరాహిత్యం, పిసినారి అన్న ముద్ర, ఆయనతో పార్టీ ముందుకు నడవదన్న భావన.. కలసి వెరసి టిడిపి నుంచి యువత దూరమవడానికి కారణమవుతోంది. అంతేకాకుండా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.  రాజధాని నిర్మాణంలోనూ చంద్రబాబు ఐదేళ్లు టెండర్లతో కాలయాపన చేసి, ఇప్పుడు గగ్గోలు పెట్టడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో భవిష్యత్ లో చంద్రబాబు ప్రజలు విశ్వసించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: