అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం చంద్రబాబునాయుడును  బాగా దెబ్బకొట్టిందని సమాచారం.  ఒక విధంగా జగన్ ఆడిన మైండ్ గేమ్ ముందు చంద్రబాబు చేతులెత్తేసినట్లే అని పార్టీ నేతలే చెబుతున్నారు. ఎందుకంటే జగన్ ప్రతిపాదనను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే పార్టీలోని నేతలు మాత్రం మద్దతుగా మాట్లాడటం లేదు.

 

జగన్ ఎప్పుడైతే జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు, ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం ఉండచ్చని ఎప్పుడైతే ప్రకటించారో వెంటనే ఆయా ప్రాంతాల్లో సానుకూలత మొదలైపోయింది. రాయలసీమ జిల్లా అయిన కర్నూలులో హై కోర్టు ఏర్పాటు దశాబ్దాల డిమాండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది జగన్ ఎప్పుడైతే కర్నూలులో హై కోర్టు ఉండచ్చని   ప్రకటించారో  వెంటనే రాయలసీమ జిల్లాలు మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసుల్లో సంబరాలు మొదలైపోయాయి. బిజెపిలోకి ఫిరాయించిన టిడిపి ఎంపి టిజి వెంకటేష్ కూడా జగన్ కు మద్దతు పలికారు.

 

జనాల మూడ్ చూసిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా నేతలు కూడా జగన్ ప్రకటనను స్వాగతించాల్సొచ్చింది. అందుకనే బిజెపి నేతలు బహిరంగంగానే జగన్ కు మద్దతు పలికారు. టిడిపి నేతలు మాత్రం ఇంకా బయటపడలేదు కానీ వ్యతిరేకించటం కూడా లేదు. అలాగని చంద్రబాబుకు మద్దతుగా ఎక్కడా మాట్లాడటం లేదు. అలాగే విశాఖపట్నం నగరంలోని ఉత్తరం ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు జగన్ కు మద్దతు పలికారు.  చివరకు లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కూడా జగన్ కు మద్దతుగా మాట్లాడారు.

 

జగన్ కు గంటా మద్దతు పలికారని తెలియగానే తెలుగుదేశంపార్టీలో సంచలనం మొదలైంది. అలాగే బిజెపి ఎంఎల్సీ మాధవ్ తో పాటు నేతలు కూడా మద్దతు పలికారు. తమ ప్రాంతాలను జగన్ అభివృద్ధి చేయాలని అనుకుంటుంటే చంద్రబాబు అడ్డు పడటం ఏమిటంటూ జనాలు మండిపోతున్నారు. చూడబోతే జగన్ ఆడిన మైండ్ గేమ్ చంద్రబాబుపై బాగానే ప్రభావం చూపుతోంది. అందుకనే పార్టీ నేతలే చంద్రబాబును బహిరంగంగా మద్దతు పలకలేకుండా ఉన్నారు. మొత్తం మీద ఒక్క ప్రకటనతో  పార్టీల నేతల్లో జగన్ చీలిక తెచ్చేశారనే అనిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: