టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అనంతపురంలో పర్యటిస్తున్నారు. మరో రెండునెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో .. పార్టీని సిద్ధం చేసేందుకు చంద్రబాబు అనంతపురంలో పర్యటనలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయడంతో పాటు.. పార్టీనేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. 

 

టీడీపీ ఆవిర్భావం నుంచి అనంతపురం జిల్లా పార్టీకి కంచుకోట. ఎప్పుడు ఇక్కడ సైకిల్‌ గుర్తును.. ప్రజలు ఆదరిస్తూనే వచ్చారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు.. పన్నెండింటిలో వైసీపీ గెలిచింది. దీంతో తమ్ముళ్లలో ఫలితాలు నిస్తేజాన్ని నింపాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని చక్కదిద్ది, రైట్‌ వేలో నడిపించేందుకు.. నేటి నుంచి మూడురోజుల పాటు చంద్రబాబు.. జిల్లాలోపర్యటిస్తారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ పార్టీ బలహీనపడటానికి కారణాలు గుర్తించనున్నారు. ఈ క్రమంలో నేతల మధ్య సయోధ్య కుదర్చడంతో పాటు .. క్యాడర్‌లోనూ ఉత్సాహాన్ని నింపనున్నారు.

 
అనంతపురం జిల్లా పర్యటనలో చంద్రబాబుకు .. సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. ఇందులో ప్రధానమైనవి నేతల మధ్య విబేధాలు. ఎన్నికల ముందు ప్రారంభమైన గొడవలు నేటీకీ కొనసాగుతున్నాయి. కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరికి, 2019ఎన్నికల్లో బరిలో ఉన్న ఉమామహేశ్వరనాయుడు మధ్య ..  టికెట్ విషయంలో మొదలైన గొడవ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఘర్షణలకు దిగుతూ పార్టీ పరువును రచ్చకీడుస్తున్నారు. ఇక శింగనమల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటగా మారింది. మాజీ ఎమ్మెల్యే యామినీబాల, ఆమె తల్లి ఎమ్మెల్సీ శమంతకమణి, ఎన్నికల్లో పోటీ చేసిన బండారు శ్రావణి, ఎమ్మార్పీఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన ఎంఎస్ రాజులమధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పరిస్థితి ఉంది.

 

ఇక ధర్మవరంలో నాలుగు నెలలుగా నియోజకవర్గ ఇన్‌ఛార్జి లేరు. ఇప్పుడు ఆ స్థానంలోకి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి వెళ్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అలాగే గ్రామాల్లో కార్యకర్తలను నేతలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికారం ఉన్నప్పుడు బాగా కనిపించిన నేతలు ఇప్పుడు నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పరిస్థితిని చంద్రబాబు ఎలా చక్కదిద్దుతారో వేచి చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: