తెలుగుదేశంపార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం వస్తోంది. ఏపికి మూడు రాజధానులంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదన ఎంత సంచలనం కలిగిస్తోందో అందరూ చూస్తున్నదే.  వివిధ రాజకీయ పార్టీల్లో కూడా అంతే కలకలం రేపింది. జగన్ ప్రతిపాదనకు మద్దతు పలకలేక అలాగని వ్యతిరేకించ లేక కొన్ని పార్టీల నేతలు నానా అవస్తలు పడుతున్నారు.

 

జగన్ ప్రతిపాదన చేయగానే బిజెపి నేతలు వెంటనే మద్దతు పలికేశారు. కాబట్టి ఆ పార్టీ నేతల్లో ఎటువంటి ఇబ్బంది కనబడలేదు. జనసేనలో ఒకటి నుండి పదో అంకె వరకూ మొత్తం పవన్ కల్యాణే కాబట్టి రెండో అభిప్రాయం లేదు. జగన్ నిర్ణయాన్ని పవన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దతు పలికారు. వామపక్షాలను ఎవరూ పట్టించుకోవటం లేదు.

 

మొత్తం సమస్యంతా తెలుగుదేశంపార్టీలోనే వస్తోంది. జగన్ నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు వ్యతిరేకిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. తప్పదన్నట్లుగా చంద్రబాబు నిర్ణయానికి కొందరు నేతలు మద్దతు పలుకుతుంటే మరికొందరు నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు.  విశాఖపట్నం సీనియర్ నేత, ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు జగన్ ప్రతిపాదనకు మద్దతుగా మాట్లాడారు. కర్నూలు జిల్లాలో కేఇ కృష్ణమూర్తి, కేఇ ప్రభాకర్ కూడా స్వాగతించారు. ఎందుకంటే కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ప్రతిపాదన చాలామంచి నిర్ణయమంటున్నారు కేఇ సోదరులు.

 

ఇక శ్రీకాకుళంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పూర్తిగా వ్యతిరేకిస్తుండగా ఎంపి రామ్మోహన్ నాయుడు మాత్రం అటు ఇటు కాకుండా మాట్లాడుతున్నారు.  విశాఖపట్నంలో ఎగ్జిక్యుటివ్ క్యాపిటిల్ ప్రతిపాదనకు మద్దతుగా కొందరు చేసిన ట్వీట్లకు ఎంపి లైకులు కొట్టారు. కానీ మీడియాలో వ్యతిరేకించటం విచిత్రంగా ఉంది.

 

ఇదే విధంగా చాలా జిల్లాల్లో నేతలు తప్పని పరిస్ధితుల్లో బహిరంగంగా వ్యతిరేకిస్తున్నా పార్టీ నేతల భేటీల్లో మాత్రం ప్రతిపాదనకు మద్దతుగానే మాట్లాడుకుంటున్నారట. అంటే చాలా మంది నేతలు పైకి చంద్రబాబు కోసమని వ్యతిరేకిస్తున్నా జనాల మూడ్ ను చూసిన తర్వాత మాత్రం లోలోపల మద్దతుగానే మాట్లాడుకుంటున్నారట. మొత్తానికి జగన్ దెబ్బకు చివరకు పార్టీలో చీలిక వచ్చినా రావచ్చంటు ప్రచారం మొదలైపోయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: