బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మ‌రోమారు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్నఆందోళ‌న‌ల‌లో బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ముందంజ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. స్వ‌యంగా మ‌మ‌త ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. తాజాగా ఆమె ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కోల్‌క‌తాలో జ‌రిగిన ఓ స‌భ‌లో మాట్లాడుతూ దీదీ మాట్లాడుతూ..త‌క్ష‌ణ‌మే పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లును, ఎన్ఆర్‌సీని ఉప‌సంహ‌రించాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే మీరెలా వాటిని అమ‌లు చేస్తారో చూస్తాన‌న్నారు.

 

ఇదే స‌మ‌యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశిస్తూ మ‌మ‌తా బెన‌ర్జీ ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. ``దేశంలో అల్ల‌ర్లు సృష్టించ‌డం కాదు, నిప్పును ఆర్ప‌డం మీ ప‌ని ` అని అమిత్‌షా షాను ఉద్దేశిస్తూ దీదీ అన్నారు. ``మీరు కేవ‌లం బీజేపీ నేత మాత్ర‌మే కాదు, ఈ దేశానికి హోంమంత్రి కూడా, దేశంలో శాంతి నెల‌కొనేలా చూడాలి`అని అమిత్‌షాను కోరారు. స‌బ్‌కా సాత్ స‌బ్‌కా వికాశ్ కాదు, మీరంతా స‌బ్‌కా సాత్ సర్వ‌నాశ్ చేస్తున్నార‌ని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిపై దూకుడుగా స్పందించే మ‌మ‌త చేసిన ఈ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

 

కాగా,  ఢిల్లీలోని జామా మ‌సీదు షాహి ఇమామ్ స‌య్యిద్ అహ్మ‌ద్ బుఖారీ మ‌రో ఆస‌క్తిక‌ర వాద‌న వినిపించారు. బిల్లుకు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా ముస్లింలు ఆందోళ‌న చేప‌డుతున్న నేప‌థ్యంలో ఆయ‌న మాత్రం పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంతో భార‌తీయ ముస్లింల‌కు ఎటువంటి న‌ష్టం లేద‌ని తెలిపారు. ఈ చ‌ట్టంతో భార‌తీయ ముస్లింల‌కు ఎటువంటి న‌ష్టం ఉండ‌ద‌ని, కానీ పాక్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన శ‌ర‌ణార్థుల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌న్న క్లారిటీ ఇచ్చారు.భార‌త్‌లో నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం ప్ర‌జాస్వామ్యం హ‌క్కు అని, దాని నుంచి మ‌న‌ల్ని ఎవ‌రూ ఆప‌లేరన్నారు. కానీ ఆ ఆందోళ‌నలు హ‌ద్దుల్లో ఉండాల‌న్నారు. భావోద్వేగాల‌ను అదుపులో ఉంచుకుని నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాల‌ని షాహీ ఇమామ్ స‌య్యిద్ అహ్మ‌ద్ బుఖారీ తెలిపారు. ఎన్ఆర్‌సీ కూడా ఇంకా చ‌ట్ట రూపం దాల్చ‌లేద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: