రాజ‌కీయం రాజ‌కీయ‌మే. కుటుంబం కుటుంబ‌మే. అందుకే, తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఈ త‌రహాలో ఆస‌క్తిక‌ర‌మైన పోరు న‌డుస్తోంది. ఇద్ద‌రు ప్ర‌ముఖ నేత‌లు త‌మ మేన‌ల్లుళ్ల కార‌ణంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ ఇద్ద‌రు ఒక‌నాటి కాంగ్రెస్ నేతలు. ప్ర‌స్తుతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి వేరే పార్టీలో చేరిపోయిన నాయ‌కులు. పార్టీలు మారిన త‌ర్వాత కూడా..వారికి మేన‌ళ్లుల్ల పోరు త‌ప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆ ఇద్ద‌రే ఒక‌నాటి కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లై స‌బితా ఇంద్రారెడ్డి, డీకే అరుణా రెడ్డి.

 

చేవెళ్ల చెల్ల‌మ్మ‌గా సుప‌రిచితురాలైన మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌హేశ్వరం నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున గెలుపొంది అనంత‌రం టీఆర్ఎస్‌లో చేరారు. ఆ వెంట‌నే ఆమెకు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. ఈ ప‌రిణామంతో షాక్ తిన్న‌ది ఎవ‌రో తెలుసా? మ‌హేశ్వ‌రం టీఆర్ఎస్ నేత తీగ‌ల కృష్ణారెడ్డి కాదు. తాండూరులో ఓటమిపాల‌యిన టీఆర్ఎస్ మాజీ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి. ఎందుకంటే...అప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లాలో ఏక‌చత్రాధిప‌త్యం నిర్వ‌హించిన మ‌హేంద‌ర్‌రెడ్డికి మేనత్త అయిన స‌బిత పార్టీలోకి రావ‌డంతో..మంత్రి ప‌ద‌వి సొంతం చేసుకోవ‌డంతో స‌హ‌జంగానే..ఆమెది పైచేయి అయింది. దీంతో..ఈ మేన‌త్త‌, మేన‌ల్లుడు మ‌ధ్య ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో గ్రూప్ వార్ న‌డుస్తోంద‌ని టాక్‌. మ‌రోవైపు త‌నపైన కాంగ్రెస్ అభ్య‌ర్థిగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన పైలెట్ రోహిత్ రెడ్డికి టీఆర్ఎస్ పెద్ద‌లు ప్రాధాన్యం ఇవ్వ‌డాన్ని...మహేంద‌ర్ రెడ్డి జీర్ణించుకోలేక‌పోతున్నారంటున్నారు.

 

ఇక ఫైర్‌బ్రాండ్ నేత డీకే అరుణ‌ది చిత్ర‌మైన ప‌రిస్థితి. అటు ఎమ్మెల్యేగా, ఇటు ఎంపీగా ఓడిపోయి రాజ‌కీయంగా గ‌డ్డుకాలంలో ఉన్న అరుణకు త‌న మేన‌ల్లుడు కార‌ణంగా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ట‌. 2018 ఎన్నికల్లో తన అత్త డీకే అరుణ మీద టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు. దీంతో అరుణ ఏక‌చ‌త్రాధిప‌త్యానికి చెక్ పెట్టిన‌ట్ల‌యింది. అయితే,ఎంపీగా పోటీ చేసి అదృష్టం ప‌రీక్షించుకోవాల‌ని అరుణ చూడ‌గా...అక్క‌డా నిరాశ ఎదురైంది. మ‌రోవైపు రాజ‌కీయంగా కూడా డీకే అరుణ‌పై ఒకింత దూకుడుగా వెళుతున్నారు. తాజాగా అరుణ మ‌ద్య నిషేధ దీక్ష చేప‌ట్ట‌గా ఆ దీక్ష‌కు ఓ రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. ఇలా డీకే అరుణ సైతం త‌న మేన‌ల్లుడి కార‌ణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొత్తంగా ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు, కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన నాయ‌కులు ఇప్పుడు మారిన రాజ‌కీయాల వ‌ల్ల సొంత మేన‌ళ్లుల్ల కార‌ణంగా రాజ‌కీయాల వ‌ల్ల ఇబ్బంది ప‌డుతున్నార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: