మూడేళ్ళ పాపని హత్య, అత్యాచారం చేసిన ఒక నీచుడికి ఒడిషాలోని కియోంజర్ జిల్లాలోని ఒక న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. ప్రత్యేక కోర్టు, అదనపు జిల్లా కోర్టు జడ్జి లోకనాథ్ సాహు ఈ సంచలన తీర్పుని ప్రకటించాడు.

వివరాల్లోకి వెళితే.. సునీల్ కుమార్ నాయక్(20) అనే ఒక వ్యక్తి తరచూ తన బంధువుల ఇంటికి వెళ్తుండేవాడు. ఆ బంధువులకి ఒక మూడేళ్ళ పాప కూడా ఉండేది. అయితే 2017 జనవరి 13న తన బంధువులు ఇంట్లోనే ఉన్నాడు సునీల్ కుమార్ నాయక్. ఆ రోజు బాలిక తల్లిదండ్రులు సంతకు వెళ్ళగానే... అదే అదనుగా భావించి ఆ మూడేళ్ల పాపను గుట్టుచప్పుడు కాకుండా బయటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత పాపను ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్లి.. అక్కడే చిన్నారిపై అత్యాచారం చేసాడు. తిరిగి మళ్ళీ పాపను ఇంటికి తీసుకువస్తుంటే.. చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో.. ఆమె బిగ్గరగా, కంటిన్యూస్గా ఏడ్చింది. దాంతో ఎక్కడ తన అఘాయిత్యం బయట పడుతుందోనని... చిన్నారి ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి కిరాతకంగా గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత చిన్నారి భౌతికకాయాన్ని ఒక ముళ్లపొదల్లో పారేశాడు.

ఇక, ఏమీ తెలియని అమాయకుడు వలె నటిస్తూ తన బంధువుల ఇంటికి వచ్చాడు సునీల్. కొన్ని గంటల తర్వాత ఇంటికి చేరుకున్న బంధువులు ఆమె కనిపించక పోయేసరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బంధువుల మిస్సింగ్ ఫిర్యాదుతో.. పోలీసులు..బాలిక ఆచూకీ కోసం వెతకగా.. ఆమె ఒక ముళ్లపొదల్లో విగతజీవిగా కనిపించింది.

దాంతో పోలీసులు బంధువుల ఇంటికి వద్దకు వెళ్లి సమీపంలోని నివాసులను ఆరా తీయగా.. సునీల్ కుమార్ నాయక్ బాలికను ఎత్తుకు పోయాడని 28 మంది చెప్పారు. శవ పరీక్షలో బాలిక భయభ్రాంతుల వలన, బాగా రక్తస్రావం అవడంతో చనిపోయిందని తేలింది. జిల్లా కోర్టు 28 మంది సాక్షుల వాంగ్మూలం తీసుకుని సునీల్ కుమార్ ని దోషిగా నిర్ధారించింది. అతి కిరాతకమైన, క్షమించరాని నేరం చేయడంతో... సునీల్ కుమార్ కు అదనపు జిల్లా కోర్టు జడ్జి ఉరి శిక్షను విధించాడు.

కానీ సునీల్ కుమార్ నాయక్ తాను అమాయకుడని చెప్పుకుంటూ.. హై కోర్ట్ కి వెళ్తానంటున్నాడు. ఏదేమైనా ఒడిశా కోర్టు అతి తక్కువ కాలంలోనే ఉరిశిక్షని విధించడం గొప్ప విషయమే అని చెప్పుకోవచ్చు. గత ఆరు నెలల్లో చిన్నపిల్లలను అత్యాచారం చేసిన కేసులలో సునీల్ కుమార్ ను మినహాయించి మరో నలుగురు దోషులకు మరణ శిక్షను విధించింది ఒడిశా న్యాయస్థానం.

మరింత సమాచారం తెలుసుకోండి: