కార‌ణాలు ఏవైనా కావ‌చ్చు..ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అభం శుభం తెలియ‌ని చిన్నారుల‌ను కిడ్నాప్ చేసే ఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. ఇందుకోసం కొన్ని ముఠాలే ప‌నిచేస్తున్నాయంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. కానీ...నిజం. డ‌బ్బుల కోసం మాత్ర‌మే కాదు.. పిల్ల‌ల‌ను ఎత్తుకుపోయి అనేక త‌ప్పుడు ప‌నుల కోసం వారిని వినియోగిస్తున్నారు. ప‌సి వయసులో చిన్నారులను కిడ్నాప్ చేసి,  బాల కార్మికులుగా, దొంగ‌లుగా మారుస్తున్నారు. వ్య‌భిచారం కూపంలోకి కూడా నెడుతున్నారు. హ‌త్య‌లు కూడా చేస్తున్నారు. న‌ర‌బ‌లి వంటివి సైతం జ‌రుగుతుండ‌టం చాలా దారుణ‌మైన అంశం. అయితే, కిడ్నాప్‌ల గురించి ఓ సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. రెండు ప్ర‌త్యేక‌మైన నెలల్లో ఎక్కువ కిడ్నాప్‌లు జరుగుతాయ‌ని తేలింది.

 


పసి వయసులో తప్పిపోయిన చిన్నారులు, వీధి బాలలు, బాల కార్మికులు, ఇంట్లో నుంచి పారిపోయినవారు, ప్లాట్‌పామ్ చైల్డ్, యాచక బాలలను గుర్తించేందుకు జాతీయ స్థాయిలో ఆపరేషన్ స్మైల్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెస్క్యూ ( చేరదీసిన) చిన్నారులను వారి తల్లిద్రండులకు అప్పగించడం, ఆశ్రయం కల్పించడం, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు. చిన్నారులతో పనులు చేయిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. గత రెండు సంవత్సరాలుగా అధికారులు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. అనేక మంది చిన్నారులకు విముక్తి పునరావాసం. ఇందులో ప్రధానంగా 14 సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులతో పాటు 14-18 మధ్య వయస్సున్న చిన్నారులను సైతం చేరదీస్తారు. ఇందులో గుర్తించిన చిన్నారులను జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ముందు హాజరుపరిచి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చైల్డ్‌హోంలలో ఆశ్రయం కల్పిస్తారు.

 

తాజాగా, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  నగరంలోని డీజీపీ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పోలీసు అధికారులు, అన్ని జిల్లాల మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థ, అక్రమరవాణా చేసేవాళ్లను చట్టపరంగా శిక్షించాలని పేర్కొన్నారు. చిన్నారుల బాగోగులను పదేళ్లపాటు చూసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది ఒక సామాజిక సేవ అన్నారు. `పిల్లలను అక్రమ రవాణా చేసే వాళ్లు జనవరి, జూన్‌లో అప్రమత్తంగా ఉంటారు. ఈ రెండు నెలల్లో ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ఉంటుందని జాగ్రత్తపడతారు. కావునా ఈ రెండు నెలలే కాకుండా ఏడాది మొత్తం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కోసం కృషి చేయాలి`అని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: