వన్యప్రాణుల వేట నిత్య కృత్యమైంది. అటవీ అధికారులు నిద్రమత్తులో జోగుతుండడంతో... మూగజీవాలకు రక్షణ లేకుండా పోతోంది.  స్వయంగా అటవీ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే వేటగాళ్ల ఉచ్చులకు జీవాలు బలైపోతున్నాయి. పంటపొలాల రక్షణ కోసం పెట్టిన వైర్లు కొన్ని చోట్ల ప్రాణాలు తీస్తుంటే ....మరికొన్ని చోట్ల వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగుతున్న వన్యప్రాణుల వధ కొనసాగుతోంది. 

 

దట్టమైన అడవులు, ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు ఉమ్మడి ఆదిలాబాద్.  అంతేకాదు....స్మగ్లింగ్, వన్యప్రాణాల వేట జరిగే జిల్లా ఏదంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లానే అనే పేరుసైతం వచ్చేలా అధికారుల తీరు కనిపిస్తోంది. అడవుల్లో తిరగరు...తిరిగినా పట్టించుకోని వాళ్లు కొందరైతే.... స్మగ్లర్లకు, వేటగాళ్లకు సహకరించేది ఇంకొందరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడవుల్లో ఉచ్చులున్నా...పంటపొలాల్లో వైర్లు విచ్చలవిడిగా వినియోగిస్తున్నా..ఇటు అటవి శాఖ గానీ,అటు ట్రాక్స్ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. దీంతో స్వేచ్ఛగా తిరగాల్సిన వన్యమృగాలు వైర్లు తాకి ప్రాణాలు విడుస్తున్నాయి.

 

నిర్మల్ జిల్లాలోని అనంతపేట శివారులో అటవీ ప్రాంతం పక్కనే ఉన్న పంట పొలాల్లో రైతులు పెట్టిన వైర్లకు తగిలి జంతువులు చనిపోతున్నాయి. అటవీశాఖ మంత్రి సొంత జిల్లా, ఆయన స్వగ్రామానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. కావాలనే కొందరు ఉచ్చులు పెట్టి, మాంసాన్ని విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పంట పొలాల్లో అమర్చిన కరెంట్ తీగలు తగిలే వన్యప్రాణులనే కాదు... గతంలో ఇక్కడ మనుషులు చనిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. 

 

ఉమ్మడి జిల్లాలోని చెన్నూర్, బెజ్జూర్, బోథ్, ఉట్నూర్ తదితర ప్రాంతాలతో పాటు...ఏజెన్సీలో సైతం ఇలాంటివి నిత్యకృత్యమయ్యాయి. గతంలో ఇక్కడ వేటగాళ్ల ఉచ్చులకు పులులు బలైన సంఘటనలు వెలుగు చూడడంతో...స్మగ్లింగ్, అడవుల్లో ఉచ్చుల బాగోతం బయటపడింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. వేటగాళ్లు, స్మగ్లర్లకు కొందరు అధికారులు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే, అటవీ అధికారులు మాత్రం ....వన్యప్రాణుల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.  ఇకనైనా అధికారులు కళ్లుతెరచి, వన్యప్రాణులకు రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదే సమయంలో ఇంటిదొంగల భరతం పట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: