వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంద‌ర్భంగా ఆంద్ర‌ప్ర‌దేశ్‌లోని వారే కాకుండా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ రాజ‌కీయ‌వేత్త‌లు ఆయ‌న‌కు విషెష్ చెప్తున్నారు. సీనియ‌ర్ నేత‌లు, ప్రముఖులు, కార్యకర్తలు ఏపీ సీఎం జ‌గ‌న్‌కు జ‌న్మదిన‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే ఒర‌వ‌డిలో ఏపీ సీఎం జ‌గ‌న్‌కు తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కె. తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఏపీ ముఖ్య‌మంత్రికి తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ విశేష్ తెలిపారు. 

 

``గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. కలకాలం ఆయరారోగ్యాలతో వర్ధిల్లాలి`అని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ మేర‌కు గ‌తంలో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గ‌తంలో వ‌చ్చిన సంద‌ర్భంలోని ఫోటోల‌ను షేర్ చేశారు. 

 

ఇదిలాఉండగా, త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీల‌క ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. చేనేతల కష్టాలను కళ్లారా చూశానని, వారి కుటుంబాలను ఆదుకునేందుకు చేనేత కార్మికులకు ఆపన్న హస్తం 'వైఎస్సార్‌ నేతన్న నేస్తం' పథకానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. ఐదేళ్లలో ప్రతి ఏటా రూ.24 వేల చొప్పున మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి అందజేస్తామని సీఎం పేర్కొన్నారు. 'ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కుటుంబాలను ఏ ఒక్కరు పట్టించుకోకపోతే గళం విప్పి గట్టిగా అడిగాం. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగులో చేనేతలు పడిన కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. ఆ రోజు నేను ఉన్నాను..నేను ఉన్నానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ప్రోత్సాహకంగా ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాను. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజు నేతన్న నేస్తం పథకాన్ని ఇదే ధర్మవరంలో ప్రారంభిస్తున్నాను. `` అని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: