జాతీయ రైతు దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన దేశ వ్యాప్తంగా జరుపుకుంటాం. రైతు లేనిదే ఈరోజు మనిషి లేడు.. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం రాదు.. ఈరోజు దేశమంతా ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటుంది అంటే అది రైతు వల్లే. అలాంటి రైతు ఆరు నెలలు కష్టపడినా, శ్రమ అంతా చేతికి దక్కుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం అటు ప్రకృతి మీద, ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం సాగిస్తున్నారు. 

 

ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి తెస్తున్నాయి. అయితే దేశాన్ని రక్షించే జవాన్‌లకు ఎంత ప్రాముఖ్యత ఉందో పట్టెడన్నం పెట్టే అన్నదాతలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే జై జవాన్‌... జై కిసాన్‌ అనే నినాదం యావత్‌ భారత దేశంలో వినిపిస్తుంది. దేశానికి వెన్నుముకగా రైతులను అభివర్ణిస్తారు. 

 

భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ జన్మదినమైన ఈ రోజు డిసెంబర్‌ 23న రైతు దినోత్సవం జరుపుకుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఒక జూదంగా మారింది. ఒక రోజు వర్షాల కోసం.. ఇంకోరోజు విత్తనాల కోసం.. మరో రోజు ఎరువుల కోసం.. బ్యాంకు రుణాల కోసం ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతోంది. 

 

ఒత్తిళ్లు, నష్టాలు, వ్యవసాయ పనుల చాకిరీ భరించలేక చాలామంది భూమి ఉన్నా వ్యవసాయం మానేస్తున్నారు. కొందరు భూమిని కౌలుకు ఇస్తున్నారు. ఎన్నికల్లో పార్టీలు రైతులకు ఎన్ని హామీలిచ్చినా రైతుల పరిస్థితి మాత్రం మారడం లేదు. పంటలు సాగు చేసి దిగుబడి రాక అప్పుల బాధలు భరించలేక, సరైన సమయంలో రుణమాఫీ కాక, దిక్కుతోచని స్థితిలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

 

ఇక కౌలు రైతుల పరిస్థితి మరి దారుణంగా ఉంది. భూమివారిది కాదు.. పంట పండితే పూర్తి పంట చేతికి రాదు.. వీరికి వ్యవసాయ రుణాలు కూడా రావు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్న వీరి విషయంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సొంత భూమి లేకపోవడం, భూమి కౌలుకు తీసుకుంటే ఎక్కువరేట్లు చెల్లించడం, భూమి యాజమాని కాకపోవడం వల్ల పంటరుణానికి ఎవరూ నమ్మడం లేదు.  

 

కష్టపడి కాలానికి ఎదురీది పంటలు పండిస్తే దళారులు రైతుల మీద పడి దోచుకుంటున్నారు. మార్కెట్లో తిష్టవేసిన దళారులు రైతుల శ్రమను చౌకగా కొని ఎక్కువ రేట్లకు జనాలకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో రైతులు కూలీగా మిగులుతుంటే దళారులు లక్షాధికారులు అవుతున్నారు. ఈ దళారుల వ్యవస్థను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతును రాజుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పంటల విషయంలో రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖలో సిబ్బంది కొరత రైతులను నష్టాలకు గురిచేస్తోంది.

 

కష్టాలను భరించేలేక ఈ కాలంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  రైతులు ఆలా చేసే ముందు ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించుకోవాలి. భార్య, పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించుకోవాలి. కష్టాలు ఈ రోజు ఉండచ్చు... రేపు పోవచ్చు.. దేశానికి అన్నం పెట్టే రైతన్నే అధైర్యపడితే ఈ సమాజానికి మెతుకు దొరకదు.  

 

అయితే ఈరోజే రైతు దినోత్సవం ఎందుకంటే ? 

 

చౌదరి చరణ్ సింగ్ భారత దేశానికి 5 వ ప్రధాన మంత్రి.. చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టబడింది. రైతుల గురించి, వ్యవసాయరంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ కృషి చేశారు.  

 

దీంతో చరణ్ సింగ్ రైతు బంధుగా పేరుతెచ్చుకున్నరు. చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వము అయిన జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. అతని జన్మదినం డిసెంబరు 23 న కిసాన్ దివస్ జాతీయ రైతు దినోత్సవంగా భారతదేశంలో జరుపుతారు...!

 

రైతు దినోత్సవం సందర్భంగా రైతు కోసం రాసిన ఓ కవి రాసిన కవిత ఇది.. మీకోసం! 

 

రైతు రాజు కాడు.


దున్నేవాడిది భూమి కాదు.


వర్షం రాదు, కరువు పోదు


కష్టం తరగదు, నష్టం తీరదు

 

అప్పులు, పేదరికం


నిరాశ, నిస్సహాయం


కన్నీళ్ల తడి ఆరదు


కానీ ఆశ చావదు

 

తాను నమ్ముకున్న మట్టి మోసం చేయదని,


శరీరాన్ని తాకట్టుపెట్టి,


మనసుని బందీ చేసి,


ఆత్మని పొలంలోనే పాతిపెట్టే


రైతు కోసం.. 

 

జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు..

మరింత సమాచారం తెలుసుకోండి: