’వికేంద్రీకరణ వల్లే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది’  ఉదయం తాడేపల్లిగూడెంలోని ఓ కళాశాలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు.

’ఏం చేస్తే మంచి జరుగుతుందో...ఎవరికి చెప్పాలో వారికి చెబుతా’… ఇది సాయంత్రం తనను కలసిన రాజధాని రైతులతో వెంకయ్య చెప్పిన మాటలు.

 

ఉదయం మాట్లాడిన మాటలకు సాయంత్రం రైతులతో  చెప్పిన మాటలకు ఎంత తేడా ఉందో అర్ధమైపోతోంది. ఓ కళాశాలలో ఉదయం వెంకయ్య మాట్లాడుతూ వికేంద్రీకరణ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టంగా వేదిక మీదనుండే ప్రకటించారు. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే వికేంద్రీకరణే మార్గమన్నారు. గ్రామాల నుండి నగరాలకు వలసలను ఆపాలన్నా వికేంద్రీకరణ జరగాల్సిందే అంటూ గట్టిగా చెప్పారు.

 

అయితే ఇక్కడే వెంకయ్య తన తెలివిని ప్రదర్శించారు.  వికేంద్రీకరణ అని పదే పదే చెప్పిన వెంకయ్య రాజధానుల వికేంద్రీకరణా లేకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది మాత్రం చెప్పలేదు. కాకపోతే వెంకయ్య చెప్పిన మాటలను బట్టి అందరికీ రాజధానుల వికేంద్రీకరణ అనే అర్ధమైంది. మరి ఉదయం నుండి సాయంత్రం మధ్యలో ఏం జరిగిందో  ఎవరికీ తెలీదు. సాయంత్రం తనను కలిసిన రైతులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి రైతుల స్వచ్చంధంగా భూములిచ్చిన విషయం తెలుసన్నారు.

 

రాజధాని రైతుల సమస్యలు తనకు తెలుసన్నారు.  ఈ విషయంలో ఏం చేస్తే బాగుంటుందో .. ఎలా చేస్తే మంచి జరుగుతుందో.. ఎవరికి చెప్పాలో వాళ్ళకు చెబుతానంటూ రైతులకు హామీ ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా పాము చావకుండా కర్ర విరక్కుండా సమస్యను దాటేశారు. ఎందుకంటే రాజధానుల మార్పు ప్రతిపాదన వచ్చింది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండే.  చెబితే జగన్ కే చెప్పాలి. ఎలాగూ రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చాలని జగన్ దాదాపు నిర్ణయానికి వచ్చేసినట్లే.

 

కాబట్టి తాను చెప్పినా జగన్ వినడన్న విషయం వెంకయ్యకు బాగా తెలుసు. పైగా రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్ర జోక్యం ఏమి ఉండదని కూడా వెంకయ్యకు తెలుసు.  అదే సమయంలో రాజధాని ముసుగులో చంద్రబాబునాయుడు చేసిన అరాచకాలు, అవినీతి వెంకయ్యకు తెలీకుండా ఉండదు.  మరి ఇన్ని విషయాలు తెలిసిన వెంకయ్య ఎవరికి ఏమని చెబుతారు ? నేరుగా జగన్ తో మాట్లాడుతానని రైతులకు ఎందుకు హామీ ఇవ్వలేదు ?  ఇపుడిదే అంశంపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: